Odisha: ఒడిశా తీరప్రాంతంలోని కేంద్రపారా జిల్లాలో కుల వివక్ష మరోసారి వెలుగులోకి వచ్చింది. రాజ్‌నగర్ బ్లాక్ పరిధిలోని ఘడియామల్ గ్రామ పంచాయతీకి చెందిన నుగావ్ గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం దాదాపు మూడు నెలలుగా, అంటే సుమారు 80 రోజులుగా పనిచేయడం లేదు. దీనికి కారణం అక్కడ దళిత మహిళను అంగన్‌వాడీ సహాయకురాలిగా నియమించడమేనని గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా చిన్నారులకు ప్రారంభ విద్యతో పాటు గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు మరియు పిల్లలకు అందాల్సిన అనుబంధ పోషకాహారం నిలిచిపోయింది.
గత సంవత్సరం నవంబర్ 20న శర్మిష్ఠ సేథిని అంగన్‌వాడీ సహాయకురాలిగా నియమించినప్పటి నుంచే ఈ కేంద్రం కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి. ఆమె నియామకం తరువాత గ్రామస్తులు పిల్లలను కేంద్రానికి పంపడం మానేశారు. అలాగే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్నారుల కోసం ప్రభుత్వం అందించే గుడ్లు, ఛతువా వంటి పోషకాహారాన్ని కూడా తీసుకోవడం నిరాకరించారు. ఎస్సీ/ఎస్టీ అత్యాచారాల నివారణ చట్టం కింద కేసులు నమోదు అవుతాయనే భయంతో గ్రామస్తులు తమ వ్యతిరేకతను బహిరంగంగా చెప్పకపోయినా, అసలు సమస్య కులమేనని అధికారులు అంగీకరిస్తున్నారు.
రాజ్‌నగర్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO) దీపాలి మిశ్రా మాట్లాడుతూ, సమస్యను పరిష్కరించేందుకు పలుమార్లు కౌన్సెలింగ్ చేసినా ఫలితం లేదని తెలిపారు. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, సబ్-కలెక్టర్ సహా పలువురు అధికారులు గ్రామానికి వచ్చి గ్రామస్తులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించినప్పటికీ, వారు తమ వైఖరిని మార్చుకోలేదన్నారు. “అంగన్‌వాడీ కేంద్రంలో దళిత మహిళ పనిచేయడం గ్రామస్తులకు ఇష్టం లేదని వారు స్పష్టంగా చెబుతున్నారు” అని ఆమె తెలిపారు.

ఈ అంగన్‌వాడీ కేంద్రంలో సహాయకురాలి పదవి చాలా కాలంగా ఖాళీగా ఉంది. 2024లో CDPO ఆ పోస్టును భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ ఎలాంటి దరఖాస్తులు రాలేదు. గత సంవత్సరం నవంబర్‌లో మరోసారి నోటిఫికేషన్ జారీ చేయగా, శర్మిష్ఠ సేథి ఒక్కరే దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆమెను నియమించారు.
సేథి నియామకానికి ముందు ఈ కేంద్రానికి మూడు నుంచి ఆరు సంవత్సరాల వయస్సు గల దాదాపు 20 మంది పిల్లలు క్రమం తప్పకుండా హాజరవుతుండేవారు. అయితే నవంబర్ 21 నుంచి హాజరు పూర్తిగా సున్నాకి పడిపోయింది. దాంతో మూడు నెలలుగా కేంద్రం మూతపడినట్టుగా మారింది.
“కొత్తగా నియమించిన సహాయకురాలిని మేము అంగీకరించలేము కాబట్టే అంగన్‌వాడీ కేంద్రం మూసివేయబడింది. మా గ్రామంలో సంప్రదాయ కుల పద్ధతులు పాటిస్తాం. అందుకే పిల్లలను పంపడం లేదు, ఆహార సామాగ్రిని కూడా తీసుకోవడం లేదు” అని ఒక గ్రామస్తుడు వెల్లడించాడు. మొదట్లో కొన్ని కుటుంబాలు గుడ్లు, ఛతువా తీసుకున్నప్పటికీ, ఇతర గ్రామస్తుల బెదిరింపులతో ఆపేశారని శర్మిష్ఠ సేథి చెప్పారు.
“గ్రామస్తులు తమ పిల్లలను పంపడం లేదు. పిల్లలకు, గర్భిణీ మహిళలకు, పాలిచ్చే తల్లులకు అందాల్సిన పోషకాహారాన్ని కూడా తీసుకోవడం లేదు. ఇది నాకు చాలా బాధగా ఉంది. ఎంతో కష్టపడి ఈ ఉద్యోగం సాధించాను. నా కులం కారణంగా తల్లిదండ్రులు ఈ కేంద్రాన్ని తిరస్కరించడం బాధాకరం” అని ఆమె వాపోయారు.
గ్రామీణ ఒడిశాలో కుల ఆధారిత వివక్ష ఇది కొత్త విషయం కాదు. 2023 నవంబర్‌లో కేంద్రపారా మునిసిపాలిటీ పరిధిలోని హజారిబాగిచా ప్రాంతంలో బ్రాహ్మణుల కోసం ప్రత్యేక దహన సంస్కార స్థలం ఉందన్న వార్తలు కూడా అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.
