Plane Crash: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలకు సంబంధించిన ఓ స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాండింగ్ అనంతరం టాక్సీ చేస్తున్న సమయంలో రెండు విమానాల రెక్కలు ఒకదానికొకటి తాకినట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చిన ఇండిగో విమానం, ముంబై నుంచి కోయంబత్తూర్కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న మరో విమానానికి దగ్గరగా వెళ్లడంతో ఈ ఘటన జరిగింది.
ఈ సమయంలో రెండు విమానాల్లోనూ ప్రయాణికులు ఉన్నారు. రెక్కలు స్వల్పంగా ఢీకొనడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే పెద్ద ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వరుసగా విమానాలకు సంబంధించిన ఘటనలు జరుగుతుండటంతో ప్రయాణికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దృష్టి సారించింది. పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలని రెండు విమానయాన సంస్థలను ఆదేశించింది. ప్రస్తుతం ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, ఇండిగో ఎయిర్లైన్స్ ఈ ఘటనపై స్పందించింది. ఫిబ్రవరి 3, 2026న హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చిన తమ విమానం 6E 791 ల్యాండింగ్ అనంతరం టాక్సీ చేస్తున్న సమయంలో మరో విమానయాన సంస్థ విమాన రెక్క చివర తాకిందని తెలిపింది. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది. సంఘటన జరిగిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చామని, భద్రతే తమ ప్రధాన ప్రాధాన్యత అని ఇండిగో వెల్లడించింది.
