Diwali: శ్మశానంలో దీపావళి వేడుకలు- 20 ఏళ్లుగా వింత ఆచారం

A unique Diwali at the crematorium: In Ratlam, people celebrate Diwali by offering lamps to their ancestors near funeral pyres

A unique Diwali at the crematorium: In Ratlam, people celebrate Diwali by offering lamps to their ancestors near funeral pyres

Diwali: సాధారణంగా దీపావళి అంటే ఇంటిని శుభ్రం చేసి, దేవుళ్లకు పూజలు చేసి, దీపాలు వెలిగిస్తూ సంతోషంగా జరుపుకునే పండుగ. అయితే మధ్యప్రదేశ్‌లోని రత్‌లామ్ గ్రామ ప్రజలు మాత్రం ఈ పండుగను ఒక విభిన్నంగా జరుపుకుంటారు — వారు దీపావళి రోజు ఇంట్లో కాకుండా, శ్మశానవాటికలో దీపాలు వెలిగిస్తారు!

శ్మశానంలో దీపావళి

రత్‌లామ్ గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరం దీపావళి ముందు రోజే (రూప చౌదస్‌ రోజు) శ్మశానంలో పండుగ జరుపుకుంటారు. ఈ ఆచారాన్ని వారు సుమారు ఇరవై సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి శ్మశానవాటికకు చేరి వేలాది దీపాలను వెలిగిస్తారు. పూర్వీకులను స్మరించి, వారి సమాధుల ముందు దీపాలు వెలిగిస్తే వారు సంతోషించి ఆశీర్వదిస్తారని నమ్మకం.

ఈ సంప్రదాయం చాలా పాతది కాదు. 2006లో కేవలం ఐదుగురు వ్యక్తులు దీపదానం కార్యక్రమాన్ని ప్రారంభించగా, ఇప్పుడు అది పెద్ద స్థాయిలో విస్తరించింది. రత్‌లామ్‌లోని ప్రేరణ సంస్థ సభ్యుడు గోపాల్ సోని మాట్లాడుతూ, “మొదట కొద్దిమంది మాత్రమే దీపాలు వెలిగించేవారు. ఇప్పుడు వేలాది మంది ముక్తిధామ్‌ శ్మశానవాటికలో దీపదానం చేస్తూ దీపావళిని జరుపుకుంటున్నారు” అని చెప్పారు.

శ్మశానంలో దీపాలు వెలిగించే సమయంలో ఒకవైపు చితులు మండుతుంటే, మరోవైపు ప్రజలు పితృదేవతలను స్మరించి దీపావళి ఉత్సవాన్ని జరుపుకుంటారు. సాధారణంగా నిశ్శబ్దంగా ఉండే ఆ ప్రదేశం రూప చౌదస్‌ రోజున మాత్రం ఆనందం, ఉత్సాహంతో నిండిపోతుంది. మహిళలు, పిల్లలు సంతోషంగా దీపాలు వెలిగించి, కొందరు టపాసులు కాల్చుతూ పండుగ జరుపుకుంటారు. “ఇక్కడికి వచ్చి పూర్వీకులకు దీపదానం చేయడం మనసుకు శాంతినిస్తుంది” అని మహిళలు చెబుతున్నారు.

మహారాష్ట్రలోనూ ఇలానే

ఇలాంటి ప్రత్యేక దీపావళి వేడుకలు మహారాష్ట్రలోని అమరావతి జిల్లా వడాళీ ప్రాంతంలో కూడా జరిగాయి. నగరం అంతా దీపాలతో ప్రకాశిస్తున్న సమయంలో, ఆ ప్రాంత శ్మశానవాటికలోనూ దీపాల వెలుగులు మెరిశాయి. యువకులు ముందుగా శ్మశానవాటికను శుభ్రం చేసి, అనంతరం మరణించిన వారిని స్మరించుకుంటూ వేలాది దీపాలు వెలిగించారు.

శ్మశాన ప్రధాన ద్వారం నుంచి అంత్యక్రియల ప్రదేశం వరకు, పాత వేచి గదుల నుంచి కొత్త షెడ్‌ల వరకు దీపాలను వెలిగించారు. ఆ వెలుగుల మధ్య ఆ ప్రదేశం ప్రశాంతంగా, కానీ ఉత్సాహభరితంగా మారింది.

శుభ్రతతో పునరుజ్జీవనం

ఇక్కడి యువకులు నాలుగు సంవత్సరాల క్రితం శ్మశానవాటిక శుభ్రతా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారంలో ఒక రోజు సమయం కేటాయించి పొదలను తొలగించారు, కొత్త మొక్కలు నాటారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో ఎమ్మెల్యే నిధి ద్వారా షెడ్‌లు, కూర్చునే సదుపాయాలు వంటి ప్రాథమిక వసతులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా వారు సమయం దొరికినప్పుడల్లా శ్మశానవాటికను శుభ్రం చేస్తూ పర్యావరణాన్ని సంరక్షిస్తున్నారు.

Also Read: e-Bike: కేవలం రూ.30 వేలతో మీ పాతబండిని ఎలక్ట్రిక్​ బైక్​గా మార్చేసుకోండి!

Diwali: శ్మశానంలో దీపావళి వేడుకలు- 20 ఏళ్లుగా వింత ఆచారం