Paracetamol: గర్భధారణ సమయంలో పారాసెటమాల్ వాడకంపై ఉన్న భయాలు, సందేహాలకు తాజా పరిశోధన తెరదించింది. గర్భిణులు నొప్పి లేదా జ్వరం కోసం వాడే పారాసెటమాల్ (అసిటమినోఫెన్) వలన పుట్టబోయే పిల్లల్లో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD), అటెన్షన్-డెఫిసిట్/హైపర్‌యాక్టివిటీ డిజార్డర్ (ADHD) వంటి నాడీ సంబంధిత సమస్యలు వస్తాయని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ప్రఖ్యాత వైద్య జర్నల్ “ది లాన్సెట్” స్పష్టం చేసింది.
ఈ విషయాన్ని యూరోపియన్ పరిశోధకుల బృందం చేసిన కీలక విశ్లేషణ నిర్ధారించింది. లండన్‌లోని సిటీ సెయింట్ జార్జ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అస్మా ఖలీల్ నేతృత్వంలోని ఈ బృందం గతంలో ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమైన 43 అధ్యయనాలను సమగ్రంగా పరిశీలించింది. కొంతమంది పరిశోధనలు పారాసెటమాల్ వాడకం పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొనడంతో గర్భిణుల్లో గందరగోళం ఏర్పడింది. ఈ సందేహాన్ని నివారించేందుకే ఈ ‘గోల్డ్ స్టాండర్డ్’ సమీక్షను చేపట్టినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
ప్రొఫెసర్ అస్మా ఖలీల్ మాట్లాడుతూ, “మునుపటి నివేదికల్లో వచ్చిన ఆ ఆరోగ్య సమస్యలకు నిజానికి మందు కారణం కాకపోవచ్చు. తల్లికి వచ్చిన జ్వరం, ఇన్‌ఫెక్షన్లు లేదా జన్యుపరమైన అంశాలే ప్రధాన పాత్ర పోషించి ఉండొచ్చు. మా విశ్లేషణ ప్రకారం, అవసరమైనప్పుడు పారాసెటమాల్ వాడటం గర్భిణులకు సురక్షితం” అని పేర్కొన్నారు.
అదేసమయంలో, నొప్పి లేదా జ్వరం ఉన్నప్పుడు చికిత్స తీసుకోకపోవడం వల్ల తల్లీబిడ్డలకు మరింత ప్రమాదం ఉంటుందని పరిశోధకులు హెచ్చరించారు. సరైన చికిత్స జరగకపోతే గర్భస్రావం, అకాల ప్రసవం వంటి సమస్యలు వచ్చే అవకాశముందని చెప్పారు. అందుకే, వైద్యుల సూచన మేరకు పారాసెటమాల్ వినియోగం సురక్షితమని ఈ అధ్యయనం మళ్లీ ధృవీకరించింది.
