Kidney Stones: ఇటీవల కాలంలో కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కడుపులో తీవ్రమైన నొప్పి, మూత్ర విసర్జన సమయంలో మంట వంటి లక్షణాలు కనిపించినప్పుడు చాలా మంది వైద్యుల సలహా తీసుకోవడం కన్నా, వివిధ సూచనలు, మూఢ నమ్మకాలను నమ్ముతున్నారు. ముఖ్యంగా బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి అనే అపోహను చాలామంది అనుసరిస్తున్నారు. అయితే ఇందులో నిజమెంత? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
వైద్య శాస్త్రం ప్రకారం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. బీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయన్న నమ్మకానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. వాస్తవానికి, బీరు తాగడం వల్ల రాళ్లు కరిగిపోవడం కాదు, కిడ్నీలకు మరింత నష్టం కలిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బీరు మూత్ర విసర్జనను పెంచుతుంది. అంటే, బీరు తాగిన తర్వాత ఎక్కువగా మూత్రం వస్తుంది. దీంతో శరీరంలోని నీరు వేగంగా బయటకు వెళ్లి డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. కానీ కిడ్నీలో రాళ్లను బయటకు పంపాలంటే శరీరానికి సరిపడా నీరు చాలా అవసరం. డీహైడ్రేషన్ వల్ల రాళ్లు మరింత గట్టిపడతాయి. అంతేకాదు, బీరు తాగినప్పుడు కిడ్నీలు సాధారణం కంటే ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది.
అలాగే బీరులో ప్యూరిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో జీర్ణమైన తర్వాత యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది. నిరంతరం బీరు తాగితే యూరిక్ యాసిడ్ పెరిగి, కొత్త రాళ్లు ఏర్పడే ప్రక్రియ మరింత వేగవంతమవుతుంది. మూత్రపిండాల్లో రాయి పరిమాణం 5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే, అది నీరు తాగినా స్వయంగా బయటకు వచ్చే అవకాశం ఉండదు. అలాంటి సమయంలో బీరు తాగడం వల్ల మూత్ర పీడనం పెరిగి, రాయి మూత్రనాళంలో చిక్కుకునే ప్రమాదం ఉంది.
ఇలా రాయి చిక్కుకోవడం వల్ల భరించలేని నొప్పి కలగడమే కాకుండా, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. కొంతమందికి అధిక మూత్ర విసర్జన వల్ల రాళ్లు తగ్గినట్లు తాత్కాలికంగా అనిపించవచ్చు. కానీ దీర్ఘకాలంలో బీరు కాలేయం, కిడ్నీలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది.
కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నప్పుడు స్వీయ వైద్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. సరైన చికిత్సతో పాటు, నివారణ కోసం రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం, నిమ్మరసం వంటి సహజ పద్ధతులను అనుసరించడం మంచిది. ముఖ్యంగా కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఉన్నవారు తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలి.
