Mobile Phone: ఈ రోజుల్లో ఎవరి చేతిలో చూసినా మొబైల్ ఫోన్లు ఉండడం సర్వసాధారణంగా మారింది. ఒకప్పుడు అవసరానికి మాత్రమే వాడిన ఈ ఫోన్లు ఇప్పుడు అత్యవసర పరికరంగా మారిపోయాయి. లేవగానే ఫోన్, ప్రయాణంలో ఫోన్, బోర్ కొడితే ఫోన్, తినేటప్పుడు ఫోన్, తిన్నాక వర్కౌట్ సమయంలో ఫోన్, రాత్రిళ్లు ఖాళీ టైమ్‌లో ఫోన్—ఇలా రోజంతా చేతిలోనే ఉంటుంది. నిద్రపోయే సమయంలో కూడా చాలామంది పక్కనే పెట్టుకుని పడుకుంటున్నారు. రీల్స్, సోషల్ మీడియా వంటివి మరింతగా మనల్ని ఫోన్‌కు అటాచ్ చేస్తూ వస్తున్నాయి.
అయితే, నిపుణులు చెబుతున్నట్టుగా ఇది చాలా ప్రమాదకరం. ముఖ్యంగా, నిద్ర సమయంలో ఫోన్ వాడటం లేదా పక్కనే పెట్టుకోవడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే, నిద్రకు సహాయపడే మెలటోనిన్ హార్మోన్లు ఆ సమయంలో పెరుగుతాయి. కానీ ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ ఈ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఫలితంగా నిద్ర రాకపోవడం, అలర్ట్‌గా ఉండిపోవడం జరుగుతుంది. దీనివల్ల స్లీప్ సైకిల్‌లో ఆటంకం కలుగుతుంది. సరైన నిద్ర లేకపోతే ఒత్తిడి పెరుగుతుంది, మరుసటి రోజున ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది.
అదనంగా, ఫోన్ బ్యాటరీ వేడెక్కడం, పేలడం వంటి ప్రమాదాలు కూడా ఉండే అవకాశం ఉంది. దీని వల్ల గాయాలు, బొబ్బలు, వాపు వంటి సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు కూడా ముప్పు తలెత్తుతుంది. ఫోన్ నుంచి వచ్చే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ తరంగాలు మెదడుపై ప్రభావం చూపుతాయి. రక్తంలో గ్లూకోజ్ కార్యకలాపాలు వేగంగా జరిగి, జ్ఞాపకశక్తి తగ్గడం, మెదడు సరిగా స్పందించకపోవడం, ADHD వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
శాస్త్రీయ ఆధారాలు తక్కువగానే ఉన్నా, ఫోన్ రేడియేషన్ కారణంగా క్యాన్సర్ ప్రమాదం ఉండొచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గర్భిణీలు ఎక్కువగా ఫోన్లు వాడితే పిండంపై ప్రభావం చూపుతుంది. పుట్టబోయే పిల్లలకు ఆరోగ్య సమస్యలు రావచ్చు. మగవారిలో కూడా స్పెర్మ్ కౌంట్, నాణ్యత తగ్గడం జరుగుతుంది.
అందుకే, పెద్దలు, చిన్న పిల్లలు అందరూ ఫోన్లను ఎక్కువగా వాడకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా నిద్ర సమయంలో పక్కన పెట్టుకుని పడుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు.
