Holding Urine: కాలం మారింది. అందరివీ బిజీ బిజీ జీవితాలే. తినడానికి, పడుకోవడానికి కూడా తీరిక లేకుండా సంపాదన కోసం పరుగులెడుతున్న బతుకులు. మన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు సకల వ్యాధులకు కారకాలు. నిద్రను ఆపుకోవడం, ఆకలిని చంపుకోవడం లాంటి అలవాట్లు చిన్నగానే అనిపించినా ధీర్ఘకాలంలో పెను సమస్యలకు దారితీస్తాయి. అదే తరహాలో టాయిలెట్ ఆపుకోవడం(Holding Urine) కూడా.
రోజువారీ బిజీ జీవితంలో, ఆఫీస్ మీటింగ్‌లలో ఉన్నప్పుడో లేక ప్రయాణాల్లో ఉన్నప్పుడో టాయిలెట్ వచ్చినప్పటికీ మూత్రాన్ని ఆపుకోవడం చాలామందికి అలవాటుగా మారుతుంది. “కాసేపే కదా, తర్వాత వెళ్లొచ్చులే” అని నిర్లక్ష్యం చేయడం వల్ల మన శరీరంలో తీవ్రమైన రుగ్మతలు ఏర్పడతాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే ప్రాసెస్ లో మూత్రాశయం (Bladder) కీలక పాత్ర పోషిస్తుంది. కానీ పదే పదే బలవంతంగా ఆపుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు (UTI – Urinary Tract Infection)
మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల జరిగే ప్రధాన నష్టం యూటీఐ ఇన్ఫెక్షన్. మూత్రంలో బ్యాక్టీరియా ఉంటుంది. ఎక్కువ సమయం మూత్రాన్ని నిల్వ ఉంచడం వల్ల ఈ బ్యాక్టీరియా మూత్రాశయంలో వేగంగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల మూత్ర విసర్జన చేసే సమయంలో తీవ్రమైన మంట, నొప్పి, పొత్తికడుపులో అసౌకర్యం కలుగుతాయి.
2. మూత్రాశయం బలహీనపడటం (Weakened Bladder Muscles)
సాధారణంగా ఒక ఆరోగ్యకరమైన మూత్రాశయం పరిమిత పరిమాణంలో మూత్రాన్ని మాత్రమే నిల్వ చేయగలదు. నిరంతరం మూత్రాన్ని నిలిపి ఉంచడం వల్ల మూత్రాశయం కండరాలు సాగిపోతాయి (Stretched Muscles). కాలక్రమేణా ఈ కండరాలు తమ శక్తినీ, సాగే గుణాన్ని కోల్పోయి బలహీనపడతాయి. దీనివల్ల వయస్సు పెరిగేకొద్దీ మూత్రాన్ని నియంత్రించుకునే శక్తి తగ్గుతుంది (Incontinence).
3. కిడ్నీ వ్యాధులు, రాళ్లు (Kidney Stones)
మూత్రాశయం నిండిపోయిన తర్వాత కూడా మూత్రాన్ని ఆపుకుంటే, ఆ నీరు రివర్స్‌లో కిడ్నీలపై ఒత్తిడిని పెంచుతుంది. ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అంతేకాకుండా మూత్రంలో ఉండే యూరుక్ యాసిడ్, కాల్షియం వంటి ఖనిజాలు నిల్వ ఉండిపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.
4. మూత్రాశయం వాపు, నొప్పి
మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపి ఉంచిన తర్వాత మూత్ర విసర్జన చేసినప్పటికీ, పొత్తికడుపు భాగంలో ఒక రకమైన తీవ్రమైన నొప్పి లేదా తిమ్మిరి మిగిలిపోతుంది. దీనిని శాస్త్రీయంగా ‘ఇంటర్‌స్టీషియల్ సిస్టైటిస్’ (Interstitial Cystitis) అని పిలుస్తారు, ఇది మూత్రాశయంలో వాపుకు దారితీస్తుంది.
జాగ్రత్తలు, సూచనలు:
-
మూత్రం వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా వెళ్లడం మంచిది.
-
రోజుకు కనీసం 2 నుండి 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి.
-
ప్రయాణాలు చేసేటప్పుడు పరిశుభ్రమైన టాయిలెట్లను ఉపయోగించండి.
ఆరోగ్యకరమైన అలవాట్లే మనల్ని దీర్ఘకాలిక రోగాల నుండి కాపాడతాయి. కాబట్టి శరీర సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. సరైన కాలంలో వ్యాధులను గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
Also Read: Earth Smell: వర్షం కురిసేటపుడు మట్టి వాసనకు కారణమిదే..!
