Jobs: టెన్త్ అర్హతతో జాబ్స్.. నెలకు రూ.18వేల పైనే జీతం

10th Pass Post Office Recruitment 2026 Apply Online Direct Link

10th Pass Post Office Recruitment 2026 Apply Online Direct Link

Jobs: గ్రామీణ యువతకు కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల కోసం 2026 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మొత్తం 28,536 ఖాళీలు ఉండగా, అందులో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1,000, తెలంగాణలో దాదాపు 600 పోస్టులు ఉన్నాయి. ఈ నియామకాల ద్వారా బ్రాంచ్ పోస్టు మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ABPM), డాక్ సేవక్ హోదాల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ప్రతి నెలా సగటున రూ.15,000 నుంచి రూ.20,000 వరకు వేతనం పొందవచ్చు. మూల వేతనంతో పాటు కరవు భత్యం (డియర్నెస్ అలవెన్స్ – DA) కూడా చెల్లిస్తారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో అమలులో ఉన్న 58 శాతం డీఏ వీరికి వర్తిస్తుంది. దీనివల్ల బ్రాంచ్ పోస్టు మాస్టర్‌కు రూ.12,000 మూల వేతనంతో పాటు రూ.6,360 డీఏ కలిపి మొదటి నెల నుంచే సుమారు రూ.18,360 జీతం అందుతుంది. అదనంగా ఇతర ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏ పెరుగుతుంది, ఏడాదికి ఇంక్రిమెంట్ వేతనంలో కలుస్తుంది.

అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్, డాక్ సేవక్‌లకు రూ.10,000 మూల వేతనంతో పాటు రూ.5,800 డీఏ చెల్లిస్తారు. దీంతో వీరికి నెలకు సుమారు రూ.15,800 వేతనం లభిస్తుంది. అంతేకాకుండా ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్‌కు సంబంధించిన సేవలపై ప్రత్యేక ఇన్సెంటివ్‌లు కూడా ఇస్తారు. ఆ సేవల విలువ ఆధారంగా బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్‌లకు ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. స్వల్ప మొత్తంలో హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. విధుల నిర్వహణ కోసం అవసరమైన ల్యాప్‌టాప్, కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌ను పోస్టల్ శాఖే అందిస్తుంది. సంబంధిత కార్యాలయానికి సమీపంలో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం తప్పనిసరి. రోజుకు సుమారు ఐదు గంటలు పనిచేస్తే సరిపోతుంది.

విధుల విషయానికి వస్తే, బ్రాంచ్ పోస్టు మాస్టర్ బ్రాంచ్ కార్యకలాపాలను పర్యవేక్షించాలి. పోస్టల్ సేవలతో పాటు ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలు, రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు, ఉత్తరాల పంపిణీ సజావుగా జరిగేలా చూడాలి. అలాగే పోస్టల్ పథకాలను ప్రజల్లో ప్రచారం చేయడం, మార్కెటింగ్ బాధ్యతలు కూడా నిర్వహించాలి.

అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ స్టాంపులు, స్టేషనరీ అమ్మకం, ఉత్తరాల పంపిణీ, డిపాజిట్లు, పేమెంట్స్ వంటి పనులు చేయాలి. బీపీఎం సూచించిన విధులు నిర్వర్తిస్తూ తపాలా పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి.

డాక్ సేవక్ ప్రధానంగా ఉత్తరాల పంపిణీ బాధ్యత తీసుకుంటారు. స్టాంపులు, స్టేషనరీ అమ్మకం, రైల్వే మెయిల్ సర్వీస్, పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్‌కు సంబంధించిన పనులు కూడా చేస్తారు.

ఎంపిక విధానం పూర్తిగా పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఖాళీలు, హోదాలు, రిజర్వేషన్ వివరాలను పరిశీలించి అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇవ్వాలి. ఎంపికైన వారికి ఎస్ఎంఎస్, ఈమెయిల్ లేదా పోస్టు ద్వారా సమాచారం అందుతుంది.

అర్హత విషయానికి వస్తే, అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష తప్పనిసరిగా చదివి ఉండాలి. ఏపీ, తెలంగాణ అభ్యర్థులు పదో తరగతి వరకు తెలుగు సబ్జెక్టు చదివి ఉండాలి.

వయసు 2026 ఫిబ్రవరి 16 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదిేళ్ల వయసు సడలింపు ఉంటుంది.

మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు మినహాయింపు ఉంది. మిగిలినవారు రూ.100 ఫీజు చెల్లించాలి.

ఆన్‌లైన్ వన్‌టైమ్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ 14-02-2026. పూర్తి వివరాలకు https://indiapost.gov.in/gdsonlineengagement వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Also Read: Credit Cards: ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ వాడితే సిబిల్ స్కోర్ తగ్గుతుందా?

Jobs: టెన్త్ అర్హతతో జాబ్స్.. నెలకు రూ.18వేల పైనే జీతం