Vijay Devarakonda: హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కారు ప్రమాదానికి గురైన సంఘటన ఇటీవల పెద్ద చర్చకు దారితీసింది. సోమవారం సాయంత్రం ఆయన ప్రయాణిస్తున్న కారు మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల సమీపంలోని ఉండవల్లి వద్ద ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ, విజయ్ దేవరకొండకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ కారు మాత్రం తీవ్రంగా దెబ్బతింది. వెంటనే ఆయన మరో వాహనంలో హైదరాబాద్‌కి చేరుకున్నారు.
తరువాత సోషల్ మీడియాలో స్పందిస్తూ, “నేను పూర్తిగా బాగున్నాను, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని తెలిపారు. ఇక ఈ ఘటనకు సంబంధించి తాజాగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి ముందే విజయ్ దేవరకొండ కారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు సమాచారం లభించింది. గచ్చీబౌలిలోని సాకేత లుంబిని అవెన్యూ వద్ద సర్వీస్ రోడ్డుపై కారు పార్క్ చేసినందుకు గతంలో ₹100 ఫైన్ విధించారు.
అంతేకాక, ఆదివారం రోజున అదే కారు పుట్టపర్తి వైపు గంటకు 114 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం స్పీడ్ గన్‌లో రికార్డ్ కావడంతో, ఓవర్‌స్పీడ్ డ్రైవింగ్ కేసు నమోదు చేసి ₹1,035 జరిమానా విధించారు. ఆసక్తికర విషయం ఏమిటంటే, తిరిగి పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో కూడా అదే ప్రాంతమైన ఉండవల్లిలోనే ఈ స్పీడ్ ఛలాన్ నమోదైంది.
టెలంగాణ e-చలాన్ పోర్టల్‌లో ఉన్న రికార్డుల ప్రకారం, విజయ్ దేవరకొండ పేరుతో రిజిస్టర్ అయిన కారు నంబర్ TG09D6939 పై మొత్తం ₹1,135 జరిమానాలు ఉన్నట్లు తేలింది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత, విజయ్ టీమ్ వెంటనే ఆ ఫైన్‌లను క్లియర్ చేయడంతో, ప్రస్తుతం ఆ వాహనంపై ఎలాంటి పెండింగ్ ఛలాన్లు లేవని చూపిస్తోంది.
ఈ సంఘటన తర్వాత అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సూచిస్తున్నారు.
