Kalki 2898 AD Part 2: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో చివర్లో ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన పాత్రల్లో లోకనాయకుడు కమల్ హాసన్ పోషించిన ‘సుప్రీమ్ యాస్కిన్’ క్యారెక్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ, ఆ పాత్ర చుట్టూ ఏర్పడిన ఆసక్తి ‘కల్కి పార్ట్–2’పై భారీ అంచనాలను పెంచేసింది.
ఇప్పుడు ‘కల్కి 2’కి సంబంధించిన తాజా అప్డేట్స్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సీక్వెల్ షూటింగ్ ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కమల్ హాసన్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను దాదాపు నెలరోజుల పాటు చిత్రీకరించేందుకు మేకర్స్ ప్రత్యేకంగా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారట. పార్ట్–2లో కమల్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతోందని, కథలో కీలక మలుపులు ఆయన చుట్టూనే తిరగనున్నాయని టాక్.
కల్కి 2లో కమల్ హాసన్‌కు సుమారు 90 నిమిషాల స్క్రీన్ టైమ్ ఉండనుందని సమాచారం. అంతేకాదు, ఈ సీక్వెల్లో ఆయన రెండు భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారట. ఒక లుక్ పార్ట్–1కు కనెక్ట్ అయ్యేలా ఉండగా, మరో లుక్ పూర్తిగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటుందని చెబుతున్నారు. ఈ రెండు లుక్స్ కథలో కీలక టర్నింగ్ పాయింట్లుగా నిలవనున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.
ఇక మరోవైపు ‘లేడీ పవర్ స్టార్’ సాయి పల్లవి కూడా కల్కి 2లో కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె పాత్ర బలంగా ఉండడంతో పాటు భావోద్వేగాలు, లోతైన డ్రామాకు ప్రధానంగా నిలుస్తుందట. ప్రభాస్ పవర్ఫుల్ ప్రెజెన్స్, కమల్ హాసన్ ఇంటెన్స్ యాక్టింగ్, సాయి పల్లవి నటన కలిస్తే కల్కి 2 ఏ స్థాయిలో ఉండబోతోందో అన్న అంచనాలు మరింత పెరుగుతున్నాయి. పార్ట్–1తో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన నాగ్ అశ్విన్, సీక్వెల్‌తో మరింత పెద్ద విజన్‌ను చూపించనున్నారని టాక్. అధికారిక ప్రకటనలు త్వరలో వెలువడే అవకాశముంది.
