Bigg Boss: నటి ఫ్లోరా సైనీ (ఆశా సైనీ) పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను ప్రస్తుతం ఒక వ్యక్తితో డీప్ డేటింగ్‌లో ఉన్నానని, కానీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మాత్రం పూర్తిగా మానేశానని తెలిపారు. ఫ్లోరా మాట్లాడుతూ — “ఈ రోజుల్లో పెళ్లి చేసుకుని తర్వాత విడిపోవడం కంటే, ప్రేమలో ఉండి జీవితాన్ని ఆనందంగా గడపడం మంచిదని నాకు అనిపిస్తోంది. పెళ్లి అనే బంధంలో చిక్కుకోకుండా స్వేచ్ఛగా, సంతోషంగా జీవించడం నా నిర్ణయం” అని అన్నారు.
తన బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న బంధం బలంగా ఉందని, ఇద్దరూ పరస్పరం అర్థం చేసుకుంటామని ఫ్లోరా తెలిపింది. “మేము ఒకరికొకరం స్పేస్ ఇస్తాం. అదే నిజమైన రిలేషన్‌షిప్ బలం. పెళ్లి అనే ఒత్తిడి లేకుండా కూడా ప్రేమ అందంగా కొనసాగుతుందనే నమ్మకం నాకుంది” అని ఆమె అన్నారు.
తెలుగులో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మొగుడు’, ‘నరసింహుడు’ వంటి పలు చిత్రాల్లో నటించిన ఫ్లోరా, బాలీవుడ్‌లో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె బిగ్ బాస్-9లో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించారు.
ఫ్లోరా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. చాలామంది ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తుంటే, కొందరు మాత్రం వివాహం పట్ల ఆమె దృష్టికోణంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయినా ఫ్లోరా మాత్రం తన నిర్ణయంపై గర్వంగా ఉందని, జీవితాన్ని తనే తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు.
