Brahmanandam: కామెడీ లెజెండ్ బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నటన, టైమింగ్, హాస్యభరితమైన హావభావాలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. ఎప్పుడూ నవ్వుల పూవ్వులా కనిపించే ఈ నటుడు, స్టేజీపై మాట్లాడితే మాత్రం వినేవారి మనసులను తాకుతారు. అలా ఎప్పుడూ నవ్వించే బ్రహ్మానందం కన్నీళ్లు పెట్టుకున్నారని చెబితే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
ఇటీవల ‘తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4’కు ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ కార్యక్రమంలో తనదైన కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా అలరించారు. అయితే, ఆ ప్రోగ్రామ్‌లో చివర్లో ఒక భావోద్వేగ క్షణం చోటుచేసుకుంది. ప్రోమోలో భాగంగా హోస్ట్ ఆయనను అడిగిన ప్రశ్నే అందర్నీ కదిలించింది.
‘దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారితో మీకు ఉన్న అనుబంధం ఏమిటి?’ అని అడగ్గా, బ్రహ్మానందం క్షణాల్లోనే ఎమోషనల్ అయ్యారు. ఎస్పీబీ తనకు ఎంతో దగ్గర వ్యక్తి అని, ఆయన తన కుటుంబ సభ్యుడిలా అనిపించేవారని చెప్పుతూ కళ్లలో నీరు తెచ్చుకున్నారు. ఆ క్షణం అక్కడున్న వారిని మాత్రమే కాదు, వీడియో చూసిన ప్రేక్షకులందరినీ కూడా కదిలించింది.
బ్రహ్మానందం సాధారణంగా స్టేజిపై ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోరు. తన కామెడీతో నవ్విస్తారు, లేకపోతే తన మాటలతో హృదయాలను తాకుతారు. కానీ ఈసారి మాత్రం ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రహ్మానందం హాస్యంలోనే కాదు, హృదయంలో కూడా ఎంత పెద్ద మనసు ఉన్న వ్యక్తో ఈ సంఘటన మరోసారి నిరూపించింది.
