June Lockhart: సినీ పరిశ్రమలో ఎన్నో తరాలు మారిపోయాయి. కొందరు చిన్న వయస్సులోనే మనలను విడిచిపోతే, మరికొందరు దీర్ఘాయుష్షు పొందుతూ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించి అనంత లోకాలకు చేరుకుంటారు. తాజాగా అలాంటి సుదీర్ఘమైన సినీ ప్రయాణం చేసిన ఒక నటి 100 ఏళ్ల వయస్సులో కన్నుమూసిన వార్త సినీ ప్రపంచాన్ని కంగారు పెట్టింది. ఆమె జీవితం, కళాప్రస్ధానం నిజంగా ఎంతో ప్రత్యేకం.
ఈమె ఎవరో కాదు, హాలీవుడ్‌లో గుర్తింపు పొందిన ప్రముఖ నటి జూన్ లాకార్ట్ (June Lockhart). 1925లో జన్మించిన ఆమె ఎనిమిదేళ్ల చిన్న వయసులోనే నటనలోకి ప్రవేశించారు. చిన్న వయసు నుండి చివరి దశ వరకు, దాదాపు 90 సంవత్సరాలు సినీ పరిశ్రమలో నిండుగా ప్రయాణించడం ఆమె ప్రత్యేకత. లాస్సీ (Lassie), లాస్ట్ ఇన్ స్పేస్ (Lost in Space) వంటి సీరియల్స్, సినిమాల ద్వారా ఆమె ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.
ఇటీవల వృద్ధాప్య సమస్యల కారణంగా కాలిఫోర్నియాలోని తన నివాసంలో ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె మరణ వార్త బయటకు రావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు. “ఆమె పూర్తి జీవితం గడిపింది… తన కళను చివరి వరకు ప్రేమించింది… ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి” అని కామెంట్లు చేస్తున్నారు.
90 సంవత్సరాల నిరంతర సినీ సేవ అనేది అసాధారణ విషయం. ఒకవైపు విచారం ఉన్నా, మరోవైపు ఆమె జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని చాలా మంది అభిప్రయపడుతున్నారు. జూన్ లాకార్ట్ నిజంగానే తన కళతో అమరత్వం పొందిన ఆర్టిస్ట్.
