Allu Aravind: ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ (94) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె, శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసి సినీ, రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది.
మధ్యాహ్నం ఆమె అంత్యక్రియలు హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో జరగనున్నాయి. ఈ సందర్భంలో కనకరత్నమ్మకు చివరి వీడ్కోలు చెప్పేందుకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోనున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సహా కుటుంబ సభ్యులు అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్నారు.
ఇక రామ్ చరణ్, అల్లు అర్జున్ లు ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం వరుసగా మైసూర్, ముంబయిలో ఉన్నారు. కానీ తల్లమ్మ మరణవార్త తెలిసి వీరిద్దరూ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకోనున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు అందరూ కలసి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.
కనకరత్నమ్మ మరణవార్త తెలిసి సినీ ప్రముఖులు, సన్నిహితులు, రాజకీయ నాయకులు ఒక్కొక్కరుగా అల్లు అరవింద్ ఇంటికి చేరుకుంటూ ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. అనేకమంది ప్రముఖులు ఈ కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆత్మస్థైర్యం కోసం అభిమానులు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని, అల్లు అరవింద్ నివాసం వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రముఖుల రాకపోకలు, అభిమానుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.
అల్లు రామలింగయ్య గారు తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలు అందరికీ తెలిసినవే. ఇప్పుడు ఆయన సతీమణి కనకరత్నమ్మ మరణం ఆ కుటుంబానికి మాత్రమే కాకుండా, మొత్తం సినీ వర్గాలకు కూడా తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థిస్తున్నారు.
