e-commerce Loophole: చైనాలో ఓ యువకుడు భారీ స్థాయిలో ఆన్‌లైన్ రీఫండ్ మోసాన్ని నడిపించాడు. ఈ సందర్భంగా అతను ఒక ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లోని రిటర్న్ సిస్టమ్‌లో ఉన్న లొసుగును చాకచక్యంగా ఉపయోగించుకున్నాడు. 17 ఏళ్ల వయసున్న యువకుడు ‘లు’ అనే ఇంటిపేరుతో గుర్తించబడ్డాడు. వాస్తవానికి ఎలాంటి ఉత్పత్తులు తిరిగి పంపకుండానే దాదాపు 11,900 నకిలీ రీఫండ్ అభ్యర్థనలు చేసినట్లు అధికారులు తెలిపారు.
రీఫండ్ పొందేందుకు అతను తప్పుడు కొరియర్ ట్రాకింగ్ నంబర్లు నమోదు చేశాడు. దీంతో విక్రేతలు సరుకు తిరిగి అందుకోకపోయినా ప్లాట్‌ఫామ్ రీఫండ్‌లను జారీ చేసింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక మేరకు, ఈ వ్యవహారం మార్చి 2024లో బయటపడింది. ఒక కాస్మెటిక్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అనుమానాస్పద రీఫండ్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్కామ్ వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో భాగంగా లు అనేక కొనుగోలుదారుల ఖాతాలను ఓపెన్ చేసి ఆర్డర్లు ఇచ్చి పదేపదే రీఫండ్ సిస్టమ్‌ను దుర్వినియోగం చేసినట్లు బయటపడింది.
కోర్టు నమోదుల ప్రకారం, లు దాదాపు 4.76 మిలియన్ యువాన్ (సుమారు ₹6.15 కోట్లు) విలువైన వస్తువులను పొందాడు. వాటిని సెకండ్ హ్యాండ్ ప్లాట్‌ఫామ్‌లలో తిరిగి విక్రయించగా, మొత్తం మీద అతను 4.01 మిలియన్ యువాన్ (సుమారు ₹5.18 కోట్లు) లాభం సంపాదించాడు. అందిన డబ్బుతో ఖరీదైన ఫోన్లు, బ్రాండెడ్ దుస్తులు కొనడం, స్నేహితులతో విలాసంగా ఖర్చు చేయడం జరిగినట్లు తెలుస్తోంది.
షాంఘై కోర్టు జూలై 2025లో తీర్పు వెలువరించి, లుకు ఆరు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. అతను మైనర్ అయినప్పటికీ, ఆన్‌లైన్ మోసాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చైనా న్యాయవ్యవస్థ ఈ తీర్పుతో స్పష్టమైన సందేశం ఇచ్చింది.
చైనాలో మరో రీఫండ్ మోసం
2025లో చైనాలో AI ఆధారిత తప్పుడు చిత్రాలను ఉపయోగించి రీఫండ్ మోసాలు చేసిన అనేక కేసులు బయటపడ్డాయి. డిసెంబర్ 2025లో ఒక కేసు బాగా వైరల్ అయింది. ఒక ఆన్‌లైన్ విక్రేత తన దుకాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని రీఫండ్ పాలసీని బహుళ అకౌంట్లతో దుర్వినియోగం చేసిన మహిళ గురించి వెల్లడించాడు. అసలు ఉత్పత్తులు తిరిగి పంపకుండా, చౌకైన వస్తువులు లేదా తప్పుడు ఆధారాలతో రీఫండ్‌లు పొందినట్లు తెలిసింది. మొత్తం 225 ఉత్పత్తులను అక్రమంగా పొందడంతో 54,000 యువాన్ (సుమారు ₹7 లక్షలు) నష్టం జరిగినట్లు విక్రేత తెలిపారు.
ఈ విషయం వెలుగులోకి రాగానే మహిళ 30,000 యువాన్ (దాదాపు ₹3.9 లక్షలు) చెల్లించి పరిష్కరించాలన్నా, విక్రేత అది నిరాకరించి చట్టపరమైన చర్యలపై దృష్టి పెట్టాడు.
భారతదేశంలో కూడా ఇటువంటి మోసాలు
ఇలాంటి రీఫండ్ మోసం భారత్‌లో కూడా నమోదైంది. జూన్ 2025లో ఢిల్లీ పోలీసులు 22 ఏళ్ల డెలివరీ ఏజెంట్ కిషన్‌ను అరెస్టు చేశారు. అతను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలను నకిలీ రిటర్న్ ప్యాకేజీల ద్వారా మోసగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. కస్టమర్లు పంపిన నిజమైన రిటర్న్ ఉత్పత్తుల స్థానంలో పాత లేదా ఉపయోగించిన వస్తువులను ప్యాక్ చేసి తిరిగి పంపినట్లు పోలీసులు తెలిపారు.
టెక్నికల్ ట్రాకింగ్, స్థానిక నిఘా ఆధారంగా అతడిని గుర్తించి అరెస్టు చేశారు. దాడిలో 38 నకిలీ మార్పిడి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నాణ్యత తనిఖీలలోని లోపాలను వాడుకుని ఈ మోసాన్ని అమలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసిన సరుకులు మొత్తం అదుపులోకి తీసుకున్నారు.
