PF Withdrawal: యూపీఐతోనే పీఎఫ్ డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి..

New EPFO app to allow members to withdraw EPF money through UPI

New EPFO app to allow members to withdraw EPF money through UPI

PF Withdrawal: ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు పీఎఫ్ ఖాతా ఉండటం తెలిసిందే. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ సామాజిక భద్రతా పథకాన్ని తీసుకొచ్చింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) దీనిని నిర్వహిస్తోంది. రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం ప్రధానంగా రూపొందించినప్పటికీ, అవసరాల సమయంలో మధ్యలోనే కొంత మొత్తాన్ని ఉపసంహరించుకునే వెసులుబాటును కూడా పీఎఫ్ కల్పిస్తోంది. వైద్య ఖర్చులు, వివాహాలు, పిల్లల చదువులు, ఇల్లు మరమ్మతులు వంటి అవసరాల కోసం పీఎఫ్ డబ్బులు తీసుకునే అవకాశం ఉంది.

అయితే గతంలో పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉండేది. అనేక డాక్యుమెంట్లు సమర్పించాల్సి వచ్చేది. ఆధార్ సీడింగ్ సమస్యలు, పరిమిత మొత్తాలే లభించడం, క్లెయిమ్స్ తిరస్కరణ వంటి ఇబ్బందులతో చందాదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అవసరమైన సమయంలో డబ్బులు అందక చాలామంది అసంతృప్తికి లోనయ్యారు.

ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ఇటీవలి కాలంలో ఈపీఎఫ్ఓ సేవలను మరింత సులభతరం చేస్తోంది. కఠిన నిబంధనలను సడలిస్తూ, ఎక్కువ మొత్తంలో ఉపసంహరణకు అవకాశం కల్పిస్తోంది. మానవ ప్రమేయం లేకుండా ఆటోమేటిక్ విధానంలో త్వరితగతిన డబ్బులు చందాదారుల ఖాతాలకు చేరేలా చర్యలు తీసుకుంటోంది.

ఇక రాబోయే రోజుల్లో పీఎఫ్ చందాదారులకు మరింత సౌలభ్యం కల్పించనున్నారు. అందులో ముఖ్యమైనది యూపీఐ ద్వారా నేరుగా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునే సదుపాయం. ఇందుకోసం కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈపీఎఫ్ఓ ఒక కొత్త మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ యాప్ మార్చి చివర్లో లేదా ఏప్రిల్ ప్రారంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశముందని సమాచారం. ఇందులో పీఎఫ్ పాస్‌బుక్ బ్యాలెన్స్ చెక్ చేయడంతో పాటు, యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాకు డబ్బులు బదిలీ చేసుకునే వీలుంటుంది.

ప్రస్తుతం యూఏఎన్ మెంబర్ పోర్టల్ లేదా ఉమంగ్ యాప్ ద్వారానే ఈ సేవలు అందుబాటులో ఉండగా, కొత్త యాప్‌తో పీఎఫ్ విత్‌డ్రా మరింత సులభమవుతుందని చెబుతున్నారు. భద్రత కోసం యూపీఐ పిన్ ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఈపీఎఫ్ఓ 100 డమ్మీ అకౌంట్లతో ట్రయల్స్ నిర్వహిస్తోంది.

Also Read: Silver Price: వెండి ధర రూ.6 లక్షలు..!

PF Withdrawal: యూపీఐతోనే పీఎఫ్ డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి..