Gold Rates: బంగారం ధరలు రోజురోజుకూ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు 10 గ్రాముల ధర లక్ష రూపాయలు దాటితేనే ఆశ్చర్యపోయిన ప్రజలు, ఇప్పుడు రూ.1.25 లక్షలకు చేరుకున్న ధరను చూసి షాక్‌కు గురవుతున్నారు. అంతర్జాతీయంగా కూడా పుత్తడి తొలిసారి ఔన్సుకు 4 వేల డాలర్ల మార్కును దాటింది. అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్‌డౌన్ భయం, ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై నెలకొన్న అనిశ్చితులు బంగారంపై డిమాండ్‌ను మరింతగా పెంచుతున్నాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,780గా ఉంది. 22 క్యారెట్ల పసిడి రూ.1,12,900గా నమోదైంది. వెండి కూడా భారీగా పెరిగి కిలో రూ.1.56 లక్షలు దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సు 4,034 డాలర్ల వద్ద, వెండి ఔన్సు 48.62 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ప్రస్తుతం 88.79గా కొనసాగుతోంది.
ఒక ఏడాదిలోనే భారీ పెరుగుదల
గత సంవత్సరం తో పోలిస్తే బంగారం ధరలు 50 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఆర్థిక, రాజకీయ అనిశ్చితులు పసిడిపై పెట్టుబడులను పెంచుతున్నాయి. ముఖ్యంగా భౌగోళిక ఉద్రిక్తతలు, టారిఫ్‌ల ప్రభావం, అలాగే కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోళ్లు జరపడం వలన ఇది సురక్షిత పెట్టుబడి సాధనంగా మారింది.
రెండేళ్ల క్రితం ఔన్సు బంగారం ధర 2 వేల డాలర్ల లోపే ఉండగా, ఇప్పుడు 4 వేల డాలర్లను దాటడం గమనార్హం. ఈ భారీ పెరుగుదలతో సాధారణ వినియోగదారులు బంగారం కొనుగోళ్లను తగ్గిస్తున్నారు. పండగ సీజన్ ఉన్నప్పటికీ ఆభరణాల అమ్మకాలు మందగించడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
