Microsoft: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) వేతనం ఈ సంవత్సరం భారీగా పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరానికి ఆయనకు 96.5 మిలియన్ డాలర్ల జీతం నిర్ణయించారు. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.846 కోట్లకు సమానం. కంపెనీ ఈ వివరాలను తన తాజా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
గత సంవత్సరం సత్య నాదెళ్ల 79.1 మిలియన్ డాలర్లు (సుమారు రూ.664 కోట్లు) అందుకున్నారు. అంటే ఈ ఏడాది ఆయన వేతనం దాదాపు 22 శాతం పెరిగినట్టే. జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ గణనీయమైన వృద్ధిని సాధించింది. కంపెనీ షేర్లు సుమారు 23 శాతం లాభపడ్డాయి.
అదేవిధంగా, సత్య నాదెళ్లకు ఈ ఏడాది 9.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.80 కోట్లు) నగదు ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. కృత్రిమ మేధ (AI) రంగంలో మైక్రోసాఫ్ట్ సాధించిన పురోగతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు పేర్కొంది.
సత్య నాదెళ్ల నాయకత్వం, ఆయన బృందం కృషి వల్ల మైక్రోసాఫ్ట్ AI రంగంలో ముందంజలో నిలిచిందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ విజయాలు సంస్థ వృద్ధికి బలమైన పునాది వేసాయని బోర్డు అభిప్రాయపడింది.
