Credit Cards: ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ వాడితే సిబిల్ స్కోర్ తగ్గుతుందా?

How Multiple Credit Cards Affect Your Credit Score?

How Multiple Credit Cards Affect Your Credit Score?

Credit Cards: బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు జారీ చేసే క్రెడిట్ కార్డులు వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. రోజువారీ ఖర్చుల నుంచి పెద్ద కొనుగోళ్ల వరకు క్రెడిట్ కార్డులు ఎంతో సౌకర్యాన్ని కల్పిస్తాయి. అయితే, క్రెడిట్ కార్డుల వినియోగం, లావాదేవీల విధానం నేరుగా సిబిల్ స్కోర్‌ (క్రెడిట్ స్కోర్)పై ప్రభావం చూపుతుందన్న విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉండటం వల్ల సిబిల్ స్కోర్ పెరుగుతుందా? లేక తగ్గుతుందా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఇప్పుడు ఈ అంశాన్ని స్పష్టంగా తెలుసుకుందాం.

సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్‌పై పలు అంశాలు ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా రీపేమెంట్ హిస్టరీ, క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో, క్రెడిట్ హిస్టరీ వ్యవధి, క్రెడిట్ మిక్స్ వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. రుణాలు, క్రెడిట్ కార్డుల బకాయిలను సమయానికి చెల్లిస్తే స్కోర్ మెరుగుపడుతుంది. ఆలస్యంగా చెల్లిస్తే లేదా చెల్లించకపోతే స్కోర్ తగ్గిపోతుంది.

ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉండటం కొన్ని సందర్భాల్లో ప్రయోజనకరంగా మారుతుంది. ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉండటం వల్ల మొత్తం క్రెడిట్ లిమిట్ పెరుగుతుంది. దీనివల్ల క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో నియంత్రణలో ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా క్రెడిట్ లిమిట్‌లో 30 శాతం లోపే వినియోగిస్తే క్రెడిట్ స్కోర్‌కు మంచిదని నిపుణులు చెబుతారు. అలాగే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు, ప్రత్యేక రివార్డ్స్ కార్డుల ద్వారా క్యాష్‌బ్యాక్‌లు, రివార్డ్ పాయింట్లు వంటి అదనపు లాభాలు పొందవచ్చు. లోన్‌లతో పాటు క్రెడిట్ కార్డులు ఉండటం వల్ల క్రెడిట్ మిక్స్ మెరుగవుతుంది. ఇది కూడా సిబిల్ స్కోర్ పెరగడానికి సహకరిస్తుంది.

అయితే, ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉండటం వల్ల కొన్ని నష్టాలూ ఉన్నాయి. ప్రతి కార్డు బిల్లును సకాలంలో చెల్లించడం కష్టంగా మారవచ్చు. ఒకసారి పేమెంట్ మిస్ అయితే సిబిల్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతేకాదు, ఎక్కువ కార్డులు ఉండటం వల్ల అవసరానికి మించి ఖర్చు చేసే అలవాటు పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల అప్పులు పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే ఒకేసారి అనేక క్రెడిట్ కార్డులకు అప్లై చేస్తే హార్డ్ క్రెడిట్ ఎంక్వైరీలు జరుగుతాయి. ఇవి కూడా తాత్కాలికంగా క్రెడిట్ స్కోర్‌ను తగ్గిస్తాయి.

కాబట్టి క్రెడిట్ కార్డులు వాడే వారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా ఆటోమేటిక్ పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించడం మంచిది. దీని వల్ల ఎలాంటి బిల్ మిస్ అవ్వదు. ప్రతి లావాదేవీని, ప్రతి బిల్లును క్రమం తప్పకుండా ట్రాక్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే రీపేమెంట్ సులభమవుతుంది, సిబిల్ స్కోర్ కూడా సానుకూలంగా ఉంటుంది.

ఇక క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటంటే, అది మీ క్రెడిట్ హిస్టరీని సూచించే మూడు అంకెల సంఖ్య. క్రెడిట్ బ్యూరోలు మీ రుణాలు, చెల్లింపుల హిస్టరీ ఆధారంగా ఈ స్కోర్‌ను నిర్ణయిస్తాయి. సాధారణంగా ఇది 300 నుంచి 900 మధ్య ఉంటుంది. ఎక్కువ స్కోర్ ఉంటే బ్యాంకుల నుంచి రుణాలు, క్రెడిట్ కార్డులు సులభంగా లభిస్తాయి.

Also Read: Mudra Loan: రూ. 20 లక్షల లోన్ కావాలా..? ఐతే ఇప్పుడే అప్లై చేయండి

Credit Cards: ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ వాడితే సిబిల్ స్కోర్ తగ్గుతుందా?