HDFC: గుడ్ న్యూస్.. లోన్లపై వడ్డీరేటు తగ్గింపు

HDFC: కొంతకాలంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక రెపో రేట్లను వరుసగా తగ్గిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది ద్రవ్య పరపతి విధాన సమీక్షల్లో నాలుగు సార్లు రెపో రేటుపై కోతలు విధించడం విశేషం. ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్లు, ఏప్రిల్‌లో మరో 25 బేసిస్ పాయింట్లు, జూన్‌లో 50 బేసిస్ పాయింట్లు, చివరగా డిసెంబర్‌లో 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. దీంతో మొత్తం 10 నెలల్లో రెపో రేటు 6.50% నుంచి 5.25%కు పడిపోయింది.

రెపో రేటు తగ్గడంతో లోన్లు తీసుకున్న వారికి ఉపశమనం లభించింది. బ్యాంకులు కూడా లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించడంతో ఈఎంఐలు లేదా లోన్ టెన్యూర్ తగ్గాయి. అలాగే కొత్తగా లోన్లు తీసుకునేవారికి కూడా తక్కువ వడ్డీలతో లోన్లు అందుబాటులోకి వచ్చాయి.

ఇప్పుడీ నేపధ్యంలో, ఆర్బీఐ నిర్ణయానికి నెలరోజుల తరువాత ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ కీలక ప్రకటన చేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) గరిష్టంగా 5 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త రేట్లు 2026 జనవరి 7 నుండి అమల్లోకి వచ్చాయని బ్యాంకు వెల్లడించింది. దీంతో ఎంసీఎల్ఆర్‌కు లింక్ అయిన హోం లోన్, వెహికిల్ లోన్, పర్సనల్ లోన్ వంటి కన్జ్యూమర్ లోన్లపై వడ్డీలు తగ్గనుందనే చెప్పొచ్చు. ఇప్పటికే ఫ్లోటింగ్ రేటుపై లోన్ ఉన్నవారు ఈఎంఐ తగ్గించుకోవచ్చు లేదా టెన్యూర్ తగ్గించుకునే అవకాశం ఉంది.

కోత తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఎంసీఎల్ఆర్ రేంజ్ ప్రస్తుతం 8.25% నుంచి 8.55% మధ్య ఉంది. ఇది లోన్ వ్యవధిని బట్టి మారుతుంది. ఓవర్‌నైట్ మరియు ఒక నెల ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు తగ్గి 8.25%కు చేరాయి. మూడు నెలల ఎంసీఎల్ఆర్ కూడా 8.35% నుంచి 8.30%కు తగ్గింది. అయితే ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.40% వద్దే కొనసాగుతోంది. ఏడాది వ్యవధి ఎంసీఎల్ఆర్ 8.45% నుంచి 8.40%కు తగ్గింది. రెండు, మూడు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ రేట్లు క్రమంగా 8.50% మరియు 8.55% వద్ద స్థిరంగా ఉన్నాయి.

ఎంసీఎల్ఆర్ అనేది బ్యాంకులు వసూలు చేసే కనీస వడ్డీ రేటు. దీనికి తగ్గ రేటుకు లోన్లు ఇవ్వకూడదని ఆర్బీఐ నియమాలు చెబుతున్నాయి. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బేస్ రేటు 8.90% కాగా, బెంచ్‌మార్క్ పీఎల్ఆర్ వార్షిక ప్రాతిపదికన 17.40%గా ఉంది.

ఇక ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల విషయానికి వస్తే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సాధారణ డిపాజిటర్లకు వారం నుంచి పదేళ్ల వరకు 2.75% నుంచి గరిష్ఠంగా 6.45% వడ్డీ ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఇది 3.25% నుంచి గరిష్ఠంగా 6.95% వరకు ఉంటుంది. అత్యధిక వడ్డీ రేట్లు సాధారణ డిపాజిటర్లకు 6.45% మరియు సీనియర్లకు 6.95%గా 18 నెలల నుంచి 3 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్లపై అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు 2025 డిసెంబర్ 17 నుంచే అమల్లోకి వచ్చాయి.

Also Read: Prabhas: థియేటర్ వద్ద బాహుబలి నినాదాలు

HDFC: గుడ్ న్యూస్.. లోన్లపై వడ్డీరేటు తగ్గింపు