7th Pay Commission: దుర్గా పూజ పండుగకు ముందు సిక్కిం ప్రభుత్వం తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కరువు భత్యాన్ని నాలుగు శాతం పెంచుతున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీబీ పాఠక్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు.
జనవరి 1, 2024 నుండి అమలులోకి వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందికి డీఏ, పెన్షనర్లకు డీఏను ప్రస్తుతమున్న 46 శాతం నుండి 50 శాతానికి పెంచాలి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించిన ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులర్ స్కేల్స్‌లో సవరించిన వేతనాలను తీసుకునే వర్క్-చార్జ్డ్ సంస్థలకు కూడా DA అనుమతిస్తుందని సిక్కిం ప్రభుత్వం తెలిపింది.
ఈ ఏడాది జూన్‌లో, సిక్కిం ప్రభుత్వం తన ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని (DA) నాలుగు శాతం పెంచింది. ఇది జూలై 1, 2023 నుండి అమలులోకి వస్తుంది. జూన్ 10న ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ అధ్యక్షతన జరిగిన రెండవ సిక్కిం క్రాంతికారి మోర్చా ప్రభుత్వం మొదటి క్యాబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి ప్రకటన వెలువడింది.
నాలుగు శాతం పెంపుతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మొత్తం డియర్‌నెస్ అలవెన్స్ 46 శాతానికి పెరిగింది. డీఏ పెంపు వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఖజానాపై రూ.174.6 కోట్ల మేర ప్రభావం పడుతుందని ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.