Tirupati Laddu Row: తిరుపతి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరిపేందుకు స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు శుక్రవారం, అక్టోబర్ 4న స్వాగతించారు.
‘X’పై ఒక పోస్ట్‌లో, ఆయన ఇలా అన్నారు: “తిరుపతి లడ్డూ కల్తీ సమస్యను దర్యాప్తు చేయడానికి సీబీఐ, ఏపీ పోలీసులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేయాలనే గౌరవనీయమైన సుప్రీంకోర్టు ఆదేశాలను నేను స్వాగతిస్తున్నాను. సుప్రీం కోర్టు ఆదేశాలు స్వాగతించదగ్గ పరిణామమని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.
భక్తులకు సెంటిమెంట్ అయిన శ్రీవారి ప్రసాదం విషయంలో రాజకీయంగా దురుద్దేశంతో కూడిన వ్యాఖ్యలు చేయడం ప్రతి ఒక్కరూ మానుకుంటే బాగుంటుందని ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతకుముందు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం కొమ్మారెడ్డి మాట్లాడుతూ కోట్లాది మంది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో ఆడుకున్న దోషులను కఠినంగా శిక్షించాలని, నిజానిజాలు బయటపెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు.
”సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం. దానితో మాకు ఎలాంటి సమస్య లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు తమ మనోభావాలతో ఆడుకున్నందున వారిని (నేరస్థులను) కటకటాల వెనక్కి నెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు” అని టీడీపీ అధికార ప్రతినిధి చెప్పారు. సిట్‌లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ సీనియర్ అధికారితో పాటు సీబీఐ, ఆంధ్రప్రదేశ్ పోలీస్‌లకు చెందిన ఇద్దరు అధికారులు ఉంటారని సుప్రీంకోర్టు తెలిపింది. సిట్ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని ధర్మాసనం పేర్కొంది. సిట్ దర్యాప్తు కాలపరిమితితో సాగుతుందని పట్టాభిరామ్ ఆశాభావం వ్యక్తం చేశారు.