Post Office Scheme: మీ పిల్లల కోసం.. రోజుకు రూ.6 పొదుపుతో రూ.లక్షలు

Bal Jeevan Bima RPLI Child Insurance Plan

Bal Jeevan Bima RPLI Child Insurance Plan

Post Office Scheme: ప్రస్తుతం జీవనశైలి మారడంతో ఖర్చులు కూడా గణనీయంగా పెరిగాయి. సోషల్ మీడియా, డిజిటల్ చెల్లింపులు విస్తరించిన తర్వాత చాలా మందిలో ఆర్థిక క్రమశిక్షణ తగ్గిపోయింది. ఎందుకు ఖర్చు చేస్తున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నాం అనే విషయాన్ని పట్టించుకోకుండా డబ్బు ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడింది. కానీ భవిష్యత్తులో ఎప్పుడు ఎలాంటి ఆర్థిక అవసరం వస్తుందో తెలియని పరిస్థితుల్లో కొంతమేర పొదుపు చేయడం చాలా అవసరం. ముఖ్యంగా పిల్లలు ఉన్న కుటుంబాలు వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుగానే పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

పిల్లల చదువు, ఇతర అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పొదుపు చేయడం ప్రారంభిస్తే భవిష్యత్తులో ఆర్థిక భారం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో పోస్ట్ ఆఫీస్ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని “బాల్ జీవన్ బీమా పథకం” అనే ప్రత్యేక స్కీమ్‌ను అందిస్తోంది.

పథకం వివరాలు

ఈ పథకంలో చేరేందుకు పిల్లల వయసు 5 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే పాలసీ తీసుకునే తల్లిదండ్రుల వయసు 45 సంవత్సరాలు మించకూడదు. ఈ పాలసీని తీసుకునేటప్పుడు కాలపరిమితిని 5 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ స్కీమ్‌లో చాలా తక్కువ మొత్తంతోనే పొదుపు ప్రారంభించవచ్చు. రోజుకు కనీసం రూ.6 నుంచి గరిష్ఠంగా రూ.18 వరకు చెల్లిస్తూ ఈ పాలసీలో చేరవచ్చు. పిల్లల పేరుపై ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి సమీపంలోని పోస్ట్ ఆఫీసును సంప్రదించాలి. అవసరమైన దరఖాస్తు ఫారం నింపి, పిల్లల వివరాలతో పాటు పాలసీదారుడి వివరాలు ఇవ్వాలి. అలాగే ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్‌కు సంబంధించిన పత్రాల కాపీలు సమర్పించి అకౌంట్ ప్రారంభించాలి.

పథకం ప్రయోజనాలు

బాల్ జీవన్ బీమా పథకం కింద ఒక కుటుంబంలో గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు మాత్రమే ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. రోజుకు కనీసం రూ.6 చెల్లిస్తే పాలసీ గడువు ముగిసే సమయానికి కనీస హామీగా రూ.1 లక్ష వరకు పొందవచ్చు. రోజుకు రూ.18 చెల్లిస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.3 లక్షల వరకు పొందే అవకాశం ఉంటుంది.

ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే వారి పేర్లపై రోజుకు గరిష్ఠంగా రూ.36 వరకు పొదుపు చేయవచ్చు. ఈ విధంగా మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ.6 లక్షల వరకు పొందే అవకాశం ఉంటుంది. అదనంగా ఈ పాలసీపై బోనస్ కూడా లభిస్తుంది. ప్రతి రూ.1000కు సంవత్సరానికి సుమారు రూ.48 బోనస్ చెల్లించబడుతుంది.

ఇతర ముఖ్యమైన నిబంధనలు

పాలసీ గడువు పూర్తికాకముందే పాలసీదారు మరణించినట్లయితే మిగిలిన కాలానికి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. పాలసీ గడువు ముగిసిన తర్వాత మొత్తం మెచ్యూరిటీ మొత్తాన్ని పిల్లలకు చెల్లిస్తారు. మరోవైపు పాలసీ కాలంలో పిల్లలు మరణించినట్లయితే డెత్ బెనిఫిట్‌ను పాలసీదారునికి అందజేస్తారు.

ఈ పథకంలో ప్రీమియంను తల్లిదండ్రులే చెల్లించాలి. అయితే ఈ పాలసీపై లోన్ తీసుకునే సదుపాయం ఉండదు. అవసరమైతే 5 సంవత్సరాల తర్వాత ఈ పాలసీని సరెండర్ చేసే అవకాశం కూడా ఉంటుంది.

మొత్తం మీద తక్కువ మొత్తంతో పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ బాల్ జీవన్ బీమా పథకం మంచి ఎంపికగా చెప్పవచ్చు.

Also Read: Couple Goals: భార్యాభర్తల మధ్య తరచూ గొడవలకు కారణాలివే..!

Post Office Scheme: మీ పిల్లల కోసం.. రోజుకు రూ.6 పొదుపుతో రూ.లక్షలు