Viral: జమ్మూకశ్మీర్‌లో పెళ్లిళ్లు సంప్రదాయాలకు, ఆచారాలకు ప్రతీకలుగా ఉంటాయి. ముఖ్యంగా వాజవాన్ అనే బహువిధ వంటకాల మాంసాహార విందు పెళ్లిళ్లలో తప్పనిసరిగా వడ్డిస్తారు. అయితే ప్రస్తుతం మటన్ కొరత పెళ్లి వేడుకలకు పెద్ద అడ్డంకిగా మారింది. దీంతో డజన్ల కొద్దీ పెళ్లిళ్లు రద్దు కావడం లేదా వాయిదా పడుతోంది.
వరదలు, కొండచరియలు విరిగిపడటంతో శ్రీనగర్–జమ్ము జాతీయ రహదారి (NH-44) గత వారం నుంచి మూసివేయబడింది. ఈ 250 కిలోమీటర్ల పొడవైన రహదారి ప్రమాదకరమైన పర్వతాలు, సొరంగాల మీదుగా సాగుతూ, లోయకు బయటి ప్రపంచంతో కలుపుతుంది. రహదారి మూతబడడంతో వందలాది సరుకులతో పాటు పశువులు మోసుకొచ్చే లారీలు కూడా చిక్కుకుపోయాయి.
ఫరూక్ అహ్మద్ అనే వ్యక్తి, తన కుమార్తె పెళ్లి సెప్టెంబర్ 7న జరగాల్సి ఉందని, ముందుగానే ఐదు క్వింటాళ్ల మటన్ ఆర్డర్ చేసి డబ్బులు చెల్లించామని తెలిపారు. ఆహ్వాన పత్రికలు పంపించుకున్న తర్వాత సరఫరా ఆగిపోవడంతో పెళ్లి రద్దు చేయక తప్పలేదని చెప్పారు. సాధారణంగా కశ్మీర్‌కి రోజూ దిల్లీ, పంజాబ్, హరియాణా రాష్ట్రాల నుంచి 50 ట్రక్కుల మేకలు, గొర్రెలు (దాదాపు 500) వస్తాయి.
మటన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖజీర్ మొహమ్మద్ రేగూ మాట్లాడుతూ, 100కి పైగా ట్రక్కులు వారం రోజులుగా అడ్డుకుపోయాయని, కొద్ది గొర్రెలను పర్వత మార్గంలో 20 కిలోమీటర్లు నడిపి తెచ్చి కొద్దిమందికే పంచారని తెలిపారు. “నిక్కా చేయడానికి కొద్దిమందే మటన్ వాడారు. కానీ వాజవాన్ విందు లేకపోవడంతో పెళ్లిళ్లు రద్దు చేశారు” అని ఆయన చెప్పారు. ఇప్పటివరకు 210కి పైగా కుటుంబాలు పెళ్లిళ్లను రద్దు చేశాయి.
వాజవాన్ విందులో మటన్‌తో డజన్ల కొద్దీ వంటకాలు తయారు చేస్తారు. అందుకే కుటుంబాలు నెలల ముందుగానే మటన్ బుక్ చేసుకుంటారు. అతిథుల సంఖ్య ఆధారంగా కనీసం రెండు క్వింటాళ్ల మటన్ వాడకం తప్పనిసరి. రేగూ ప్రకారం, జమ్మూకశ్మీర్‌లో ఏడాదికి సుమారు రూ.4,000 కోట్ల మటన్ వ్యాపారం జరుగుతుందని, అందులో రూ.1,500 కోట్ల విలువైన మటన్ పెళ్లిళ్లకే వాడతారని తెలిపారు.
డౌన్‌టౌన్‌కి చెందిన ఇష్టియాక్ అహ్మద్ అన్నయ్య పెళ్లి ఇటీవల జరిగింది. రోజువారీ కూలీగా పనిచేసే ఆయన, 2.5 క్వింటాళ్ల మటన్ కోసం దాదాపు రెండు లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చేదని, కానీ పెళ్లి విందు రద్దు చేసి దగ్గరి బంధువులతో చిన్నగా చేసుకోవడంతో అప్పు తప్పించుకున్నామని తెలిపారు.
ఈ రద్దులు చెఫ్‌లు, వెడ్డింగ్ ప్లానర్లు వంటి వర్గాలపై కూడా ప్రభావం చూపాయి. ప్రముఖ చెఫ్ కుటుంబానికి చెందిన మోహమ్మద్ షరీఫ్ ఖాన్ మాట్లాడుతూ, ఒక్క క్వింటాల్ మటన్ వంటకానికి 15 నుండి 25 వేల రూపాయలు తీసుకుంటామని, కానీ ఇప్పుడు ఆర్డర్లు తగ్గిపోవడంతో ఆదాయం దెబ్బతిన్నదన్నారు. లోయలోనే మటన్ ఉత్పత్తి పెరిగి ఉంటే ఈ సంక్షోభం ఉండేదే కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఒక వెడ్డింగ్ ప్లానర్ మాట్లాడుతూ, పెళ్లిళ్లను తిరిగి షెడ్యూల్ చేయడం కష్టంగా మారిందని, అక్టోబర్‌లోపు పెళ్లిళ్లు జరపాలని కుటుంబాలు పట్టుబడుతున్నాయని తెలిపారు.
కశ్మీర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు జావిద్ టెంగా మాట్లాడుతూ, జాతీయ రహదారి మూతబడటంతో ఆహార సరఫరా అంతరాయం ఏర్పడిందని, వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలు అయిన ముగల్ రోడ్ వంటి రహదారులను తెరవాలని డిమాండ్ చేశారు. పెళ్లిళ్లు రద్దు కావడం వల్ల అనుబంధ రంగాలు కూడా నష్టపోతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
