Kaleswaram: కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావుకు హైకోర్టు ఊరట

High Court gives relief to KCR and Harish Rao in Kaleshwaram case

High Court gives relief to KCR and Harish Rao in Kaleshwaram case

Kaleswaram: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్ రావులకు కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు తాత్కాలిక ఉపశమనం లభించింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ మధ్యంతర పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావులు, కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ముందే పిటిషన్ దాఖలు చేశారు.

వాదనల సందర్భంగా అడ్వకేట్ జనరల్ (ఏజీ) కోర్టు దృష్టికి కొన్ని అంశాలను తీసుకువచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను ఇప్పటికే అసెంబ్లీలో చర్చించినట్లు తెలిపారు. అలాగే, ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించనున్నట్లు కోర్టుకు స్పష్టంచేశారు. ఇప్పటివరకు కేసీఆర్, హరీష్ రావుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని కూడా వివరించారు.

దీనిపై హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. “సీబీఐ విచారణకు సిఫారసు చేశారని చెప్పారు కదా?” అని కోర్టు అడగగా, ఏజీ సమాధానంగా “సీబీఐ దర్యాప్తు పూర్తయిన తర్వాతే చర్యలు ఉంటాయి. కమిషన్ రిపోర్టులో ఎవరిపైనా నేరుగా చర్యలు తీసుకోవాలని పేర్కొనలేదు” అని చెప్పారు.

ఈ నేపథ్యంలో, తదుపరి విచారణ జరిగే వరకు కేసీఆర్, హరీష్ రావుపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసును అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.

విచారణ అనంతరం, కేసీఆర్, హరీష్ రావు తరఫు న్యాయవాది అర్యమ సుందరం మాట్లాడుతూ – “మేము పీసీ ఘోష్ కమిషన్‌పై ఎంక్వైరీని రద్దు చేయాలని కోరాము. ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు వద్దని హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది” అని తెలిపారు.

Also Read: Marriage Life: కొత్తగా పెళ్లైందా.. ఐతే ఇవి పాటించండి!

Kaleswaram: కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావుకు హైకోర్టు ఊరట