Amazon: అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ స్కాలర్‌షిప్ తో యువతికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం

Amazon Future Engineer Scholarship provides software job to mahabubnagar woman

Amazon Future Engineer Scholarship provides software job to mahabubnagar woman

Amazon: తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన సామల కీర్తి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ స్కాలర్‌షిప్ చేయూతగా నిలిచింది. ఈ ఉపకారవేతనం సహాయంతో ఆమె ఐటీ రంగంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పొందగలిగారు. ప్రస్తుతం ఆమె అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా చేరారు.

కీర్తి మాట్లాడుతూ, “మా నాన్న కిరాణా దుకాణం నడిపిస్తూ నెలకు సుమారు రూ. 25 వేల వరకు సంపాదిస్తూ ఇల్లు నెట్టుకొస్తున్నారు. అమెజాన్‌లో ఉద్యోగం పొందడం అసాధ్యం అనిపించింది. కానీ అమెజాన్ స్కాలర్‌షిప్ ఆర్థిక సాయం మాత్రమే కాకుండా, నైపుణ్య శిక్షణ, మెంటర్‌షిప్, ఇంటర్న్‌షిప్ అవకాశాలు కూడా కల్పించింది. ఇది నాకు ఆత్మవిశ్వాసం, మార్గదర్శకత్వం ఇచ్చి నా కెరీర్‌ను పూర్తిగా మార్చింది” అని చెప్పారు.

అమెజాన్ సంస్థ, అల్పాదాయ వర్గాల యువతులను ప్రోత్సహించే లక్ష్యంతో మరో 500 కొత్త స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన ప్రతి విద్యార్థికి నాలుగేళ్ల కాలానికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం, ల్యాప్‌టాప్, ప్రత్యేక శిక్షణ, ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభిస్తాయి. గతంలో ఈ స్కాలర్‌షిప్ పొందిన వారిలో 80 శాతం మంది ఫార్చ్యూన్ 500 కంపెనీలలో ఉద్యోగాలు పొందినట్లు వివరించారు.

అమెజాన్ ఇండియా, అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ లీడ్ ప్రతీక్ అగర్వాల్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం టైర్-2, టైర్-3 నగరాల విద్యార్థులకు కూడా మంచి అవకాశాలను అందిస్తూ, సాంకేతిక రంగంలో మహిళల ప్రతిభను వెలికితీస్తోందని తెలిపారు.

ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ (FFE) సీఈవో రామ్ కోలవెన్ను మాట్లాడుతూ, ఈ స్కాలర్‌షిప్ కేవలం మంచి ఇంజినీర్లను మాత్రమే కాకుండా భవిష్యత్తులో టెక్ రంగాన్ని నడిపించే నాయకులను తయారు చేస్తుందని అన్నారు.

దరఖాస్తు వివరాలు:

2025-2029 విద్యా సంవత్సరాల కోసం దరఖాస్తులు ఆగస్టు 18 నుండి నవంబర్ 30, 2025 వరకు అందుబాటులో ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత కోర్సుల్లో చదువుతున్న మహిళా ఇంజినీరింగ్ విద్యార్థులు అర్హులు. మరిన్ని వివరాల కోసం 👉 www.amazonfutureengineer.in/scholarship ను సందర్శించవచ్చు. అమెజాన్, FFEతో కలిసి ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. ఎంపికైన విద్యార్థుల జాబితా 2026 ప్రారంభంలో ప్రకటించబడుతుంది.

ఈ స్కాలర్‌షిప్‌లు ప్రతిభావంతులైన యువతులకు సాంకేతిక రంగంలో ఉన్నత స్థానాలకు చేరుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

Also Read: Ganesh Chaturthi: 1000 కిలోల చాక్లెట్లతో కొలువుదీరిన గణేశుడు

Amazon: అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ స్కాలర్‌షిప్ తో యువతికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం