Holi: రంగుల పండుగ హోలీ అంటే సాధారణంగా కేరింతలు, రంగుల సందడి, చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందంగా జరుపుకునే వేడుక. కానీ మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మాత్రం హోలీ పండుగకు ప్రత్యేకమైన, కొంచెం భిన్నమైన ఆచారం ఉంది. ఇక్కడ హోలీ అంటే కేవలం రంగులు పూసుకోవడం మాత్రమే కాదు.. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటేనే పండుగ పూర్తైనట్లుగా భావిస్తారు. దశాబ్దాలుగా ఈ వింత సంప్రదాయం కొనసాగుతోంది.
రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఒకరోజే హోలీ జరుపుకుంటే, వెల్దుర్తిలో మాత్రం ఒకరోజు ముందుగానే రంగుల వేడుకలు ప్రారంభమవుతాయి. ఉదయం దైవ ప్రార్థనలతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు, సాయంత్రం వరకూ ఆనందంగా సాగుతాయి. అయితే రాత్రి అయ్యేసరికి వేడుకలు కొంత పోరాట వాతావరణాన్ని సంతరించుకుంటాయి.
హోలీ రోజు రాత్రి గ్రామస్తులంతా ఒక్కచోట చేరతారు. డప్పుల మోతల మధ్య భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఊరేగింపులో ఒక పొడవాటి తాడును ఊరంతా తిప్పుతూ చివరికి హనుమాన్ దేవాలయం వద్దకు తీసుకెళ్తారు. అక్కడే ఈ ప్రత్యేక ఆచారం ప్రారంభమవుతుంది. గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోతారు.
ఒక చేత్తో పెద్ద తాడును గట్టిగా పట్టుకుని, మరో చేత్తో ఎదుటి వర్గంపై పిడిగుద్దులు కురిపిస్తారు. ఎదుటివారు కూడా అదే విధంగా ప్రతిస్పందిస్తారు. ఎవరూ తాడు విడవకుండా, వెనక్కి తగ్గకుండా ఈ ఆచారాన్ని కొనసాగిస్తారు. ఈ సందర్భంగా కొందరికి స్వల్ప గాయాలు అయినా వాటిని పెద్దగా పట్టించుకోరు.
ఇది వ్యక్తిగత వైరం వల్ల చేసే పని కాదని, తరతరాలుగా వస్తున్న సంప్రదాయం మాత్రమేనని స్థానికులు చెబుతున్నారు. ఇలా పిడిగుద్దులతో హోలీ జరుపుకుంటే గ్రామం సుభిక్షంగా ఉంటుందని, అందరికీ శాంతి, సంతోషాలు కలుగుతాయని వారి విశ్వాసం. అందుకే ఈ ప్రత్యేక హోలీ వేడుక వెల్దుర్తిలో ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది.
Also Read: Vijay: భార్యతో విడాకులు.. రూ.250కోట్లు ఆఫర్ చేసిన హీరో విజయ్?
Holi: వింత ఆచారం.. చెప్పులతో కొట్టుకుంటూ హోలీ
