Vijay: కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఆయన భార్య సంగీత విడాకులు కోరుతూ తమిళనాడులోని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె అధికారికంగా విడాకుల పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్‌లో భాగంగా విజయ్‌కు ఓ ప్రముఖ నటితో సన్నిహిత సంబంధం ఉందని సంగీత ఆరోపించినట్లు సమాచారం. అలాగే తన జీవనోపాధి, కుటుంబ పోషణ కోసం విజయ్ ఆస్తుల్లో 50 శాతం వాటా ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. దళపతి విజయ్ ఆస్తుల మొత్తం విలువ సుమారు రూ.600 కోట్లు అని అంచనా. దీంతో ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతున్న ప్రశ్న ఏమిటంటే — ఒకవేళ కోర్టు తీర్పు సంగీతకు అనుకూలంగా వస్తే, విజయ్ తన ఆస్తుల్లో 50 శాతం ఇవ్వాల్సి వస్తుందా?
సోషల్ మీడియాలో ఇదే అంశం విస్తృతంగా చర్చకు వస్తోంది. దేశంలో అత్యంత ఖరీదైన విడాకుల ఉదాహరణలుగా జోహో సీఈవో శ్రీధర్ వెంబు–ప్రమీలా శ్రీనివాసన్ విడాకులు, అలాగే హృతిక్ రోషన్–సుస్సాన్ ఖాన్ విడాకులు ప్రస్తావనకు వస్తున్నాయి. హృతిక్ తన మాజీ భార్యకు దాదాపు రూ.380 కోట్ల విలువైన ఆస్తి ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో విజయ్ విషయంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుందా అన్న సందేహం వ్యక్తమవుతోంది.
అయితే భారత చట్టాల ప్రకారం పాశ్చాత్య దేశాల్లో ఉన్నట్లుగా 50-50 ఆస్తి విభజన తప్పనిసరి కాదు. విడాకులు తీసుకున్న వెంటనే భర్త ఆస్తిలో సగం భార్యకు ఇవ్వాలని ఎక్కడా చట్టం నిర్దేశించలేదు. ప్రతి కేసును కోర్టు వేర్వేరుగా పరిశీలిస్తుంది. భార్యాభర్తల ఆదాయం, కుటుంబ ఖర్చులు, పిల్లల అవసరాలు, భవిష్యత్ భద్రత వంటి అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే భరణం లేదా ఆస్తి భాగస్వామ్యంపై నిర్ణయం తీసుకుంటుంది.
అదేవిధంగా విజయ్ సంపాదించిన వ్యక్తిగత ఆస్తి ఎంత? వారసత్వంగా వచ్చిన ఆస్తి ఎంత? వంటి అంశాలు కూడా కోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశముంది. అన్ని విషయాలు పరిశీలించిన తరువాతే తుది నిర్ణయం వెలువడుతుంది. దీంతో ప్రస్తుతం ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
