Donald Trump: ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చలు.. కారణమిదే..!

Trump Appears With Red Rash On Neck, Officials Say Caused By Skin Cream

Trump Appears With Red Rash On Neck, Officials Say Caused By Skin Cream

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై జరుగుతున్న చర్యల్లో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చలు కనిపిస్తున్న ఫొటోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “ట్రంప్‌కు ఏమైంది?” అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఫిబ్రవరి 19న వైట్‌హౌస్‌లోని ఈస్ట్ రూమ్‌లో జరిగిన మెడల్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో తీసిన ఫొటోలలో ఆయన మెడపై ఎర్రటి మచ్చలు స్పష్టంగా కనిపించాయి. ఇవే చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఊహాగానాలు మొదలయ్యాయి.

ఈ విషయంపై వైట్‌హౌస్ అధికారికంగా పెద్దగా వివరాలు వెల్లడించకపోయినా, ట్రంప్ వాడుతున్న స్కిన్ క్రీమ్ వల్లే ఈ ఎర్రటి మచ్చలు ఏర్పడ్డాయని తెలిపింది. ట్రంప్‌కు ఎలాంటి తీవ్రమైన చర్మవ్యాధి లేదని సూచించింది. ఆయన వ్యక్తిగత వైద్యుడు సీన్ బార్బబెల్లా మాట్లాడుతూ, ట్రంప్ మెడకు ఒక సాధారణ “ప్రివెంటివ్ స్కిన్ క్రీమ్” వాడుతున్నారని చెప్పారు. ఆ క్రీమ్ కారణంగా చర్మం తాత్కాలికంగా ఎర్రబడిందని, ఆ రంగు తగ్గడానికి కొన్ని వారాలు పట్టవచ్చని వివరించారు.

ఇదిలా ఉండగా, గతంలో కూడా ట్రంప్ చేతులపై ఎర్రటి మచ్చలు కనిపించాయి. ఆ సమయంలో ఆయన స్వయంగా స్పందిస్తూ, తాను రక్తాన్ని పలుచగా ఉంచేందుకు ఆస్పిరిన్ మాత్రలు తీసుకుంటున్నానని చెప్పారు. అందువల్ల ఎవరికైనా షేక్‌హ్యాండ్ ఇచ్చినప్పుడు చర్మం త్వరగా ఎర్రబడుతుందని వివరించారు.

గత ఏడాది ట్రంప్‌కు ‘క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ’ అనే సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది కాళ్లలో రక్తప్రసరణ సరిగా లేక వాపు వచ్చే పరిస్థితి. ప్రస్తుతం ఆయన వయస్సు 79 సంవత్సరాలు కావడంతో ఆరోగ్యంపై ఎప్పుడూ ప్రత్యేక నిఘా ఉంటోంది. అయితే తాజా ఎర్రటి మచ్చలపై తీవ్ర ఆందోళన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read: Breakfast: ఈ సమస్యలున్నవాళ్లు రోజూ ఇడ్లీ తిన్నారో.. ఇక అంతే..!

Donald Trump: ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చలు.. కారణమిదే..!