Web Series: బెంగళూరులో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన తల్లిదండ్రులను దిగ్భ్రాంతికి గురి చేసింది. గాంధార్ అనే 14 ఏళ్ల బాలుడు, ఓ జపనీస్ వెబ్ సిరీస్ ప్రభావంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
సోమవారం రాత్రి భోజనం చేసిన గాంధార్, తమ పెంపుడు కుక్క రాకీతో కొంతసేపు ఆడుకున్నాడు. తరువాత తన గదికి వెళ్లి, ఒక ఆత్మహత్య లేఖ రాశాడు. అందులో— “మీరు నన్ను 14 ఏళ్లు ఎంతో ప్రేమగా పెంచారు. మీతో గడిపిన ప్రతి క్షణం నాకు ఆనందంగా గడిచింది. కానీ ఇప్పుడు వెళ్లే సమయం వచ్చింది. ఈ లేఖ మీరు చదివే సమయానికి నేను స్వర్గంలో ఉంటాను” అని పేర్కొన్నాడు.
బాగా చదివే, పాఠశాలలో ఎవరితోనూ విభేదాలు లేని గాంధార్ ఇలా చేయడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. విచారణలో, అతను చూసిన సిరీస్‌లోని ఒక పాత్ర బొమ్మను తన గదిలో గోడపై గీసినట్లు గుర్తించారు. ఆ సిరీస్ కథలో, ఒక మాయా పుస్తకంలో చెడ్డవారి పేర్లు రాసిన వెంటనే వారు మరణిస్తారు.
గాంధార్ ఆ సిరీస్‌ను నిత్యం చూస్తూ, దాని ప్రభావంలో మునిగిపోయి, చివరికి అదే తరహా ఆలోచనతో బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు శుక్రవారం ధ్రువీకరించారు.
