Jai Hanuman: ఆంజనేయస్వామికి తమలపాకంటే ఎందుకు ఇష్టమంటే?

Why is a garland of betel leaves offered to Lord Hanuman?

Why is a garland of betel leaves offered to Lord Hanuman?

Jai Hanuman: సీతమ్మ తల్లికి కలిగిన అపారమైన శోకాన్ని తొలగించి ఆమెకు ధైర్యం నింపినవాడు హనుమంతుడు. రామయ్యకు సీతమ్మ జాడను తెలిపి ఆయన హృదయాన్ని ఓదార్చిన మహానుభావుడు ఆయనే. రామలక్ష్మణులు తనకు శత్రువులు కాదని, వాలి పంపినవారు కాదని సుగ్రీవునికి స్పష్టంగా చెప్పి అతనిలోని భయాన్ని తొలగించాడు. అలాగే అహంకారం, పరస్త్రీ వ్యామోహమే నిన్ను నాశనం చేస్తుందని నిర్భయంగా రావణునికి హితవు పలికిన ధీరుడు కూడా హనుమనే. అటువంటి మంగళమూర్తి ఆంజనేయుడు.

శాస్త్ర వచనాల ప్రకారం ఆంజనేయుడు శివాంశసంభూతుడు. శివుని పదకొండవ అవతారంగా హనుమంతుడిని పరాశర సంహిత పేర్కొంటుంది. వైశాఖ మాసం బహుళ దశమి తిథి హనుమజ్జయంతిగా గ్రంథాలు చెబుతాయి. వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినవాడు కనుక ఆయన వాయుసుతుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు.

ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజిస్తే సకల శుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. దీనికి వెనుక ఒక అందమైన కథ కూడా ఉంది. ఒకసారి శ్రీరాముడు తమలపాకులు సేవిస్తూ ఉండగా, అక్కడికి వచ్చిన హనుమంతుడు “స్వామీ, మీ నోరు ఎందుకు అంత ఎర్రగా ఉంది?” అని ప్రశ్నించాడు. అప్పుడు రాముడు, “తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి” అని చెప్పాడు. రాముడి మాట హనుమంతునికి ఆజ్ఞలాంటిది. వెంటనే ఆయన వెళ్లి ఒళ్లంతా తమలపాకులు కట్టుకొని, రాముడి ఆరోగ్యం మరింత బాగుండాలని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడని పురాణ కథనం.

వాయుపుత్రుడు ఎక్కువగా తమలపాకు తోటల్లో, కదళీవనం అంటే అరటి తోటల్లో విహరిస్తాడని చెబుతారు. వానర స్వరూపానికి అరటి ఫలాలంటే విశేషమైన ఇష్టం. అంతేకాదు, హనుమంతుడు రుద్రసంభూతుడు కావడంతో, శాంతిని ప్రసాదించే తమలపాకులతో పూజిస్తే భక్తులకు కూడా మనశ్శాంతి, సుఖసంతోషాలు కలుగుతాయి. తమలపాకులను నాగవల్లీదళాలు అని కూడా అంటారు. వీటితో పూజ చేయడం వల్ల నాగదోష శాంతి జరుగుతుందని విశ్వాసం.

మరో కథ ప్రకారం, అశోకవనంలో సీతమ్మవారికి రాముడి సందేశం వినిపించినప్పుడు, అక్కడ పూలు లభించకపోవడంతో ఆనందంతో హనుమంతుడికి తమలపాకుల దండ వేశారట. అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రత్యేక ప్రీతి అని చెబుతారు.

అరటి తోటలో హనుమంతునికి పూజ చేయడం కోటిరెట్లు ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు పేర్కొంటాయి. శతవృద్ధ జిల్లేడు, తెల్ల జిల్లేడు వేరు చెక్కతో హనుమంతుని ప్రతిమ తయారు చేసి అరటి తోటలో పూజిస్తే స్వామి త్వరగా అనుగ్రహిస్తాడని నమ్మకం. అరటిపండ్ల నివేదన, సింధూర సమర్పణ, శని మరియు మంగళవారాల్లో తమలపాకులతో పూజ చేయడం హనుమారాధనలో ముఖ్యమైన అంశాలు. హస్త, మృగశీర్ష నక్షత్రాలతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులుగా భావిస్తారు.

భూత, ప్రేత, పిశాచాది బాధలు, రోగాలు, కష్టాలు తొలగేందుకు ఆంజనేయ ప్రదక్షిణలు శ్రేష్ఠమని గ్రంథాలు చెబుతున్నాయి. పరాశర సంహిత, ఉమాసంహిత, హనుమ సంహిత వంటి గ్రంథాలు స్వామి మహిమలను విశదీకరిస్తాయి. హనుమారాధన భోగమూ, మోక్షమూ రెండింటినీ ప్రసాదిస్తుంది. రామనామ స్మరణ జరిగే ప్రతి చోట హనుమంతుడు తప్పక వచ్చి కూర్చుంటాడని భక్తుల అచంచల విశ్వాసం.

Also Read: Egg: గర్భిణీలు గుడ్డులోని పచ్చసొన తినొచ్చా..!

Jai Hanuman: ఆంజనేయస్వామికి తమలపాకంటే ఎందుకు ఇష్టమంటే?