Egg: చాలామంది గుడ్డు తినేటప్పుడు తెల్లసొనకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, పచ్చసొనను పక్కన పెడతుంటారు. కానీ వాస్తవానికి గుడ్డులోని అసలైన పోషక విలువలు ఎక్కువగా పచ్చసొనలోనే ఉంటాయి. గుడ్డు తెల్లసొనలో ప్రధానంగా ప్రోటీన్ మాత్రమే ఉండగా, పచ్చసొనలో శరీరానికి అవసరమైన అనేక కీలక పోషకాలు దాగి ఉన్నాయి.
పచ్చసొనలో విటమిన్ A, D, E, K వంటి ఫ్యాట్ సాల్యూబుల్ విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఎముకల ఆరోగ్యం మెరుగుపరచడంలో, చర్మం మరియు కంటి చూపు కాపాడడంలో ఎంతో సహాయపడతాయి. అలాగే పచ్చసొనలో ఉండే కోలిన్ అనే పోషకం మెదడు పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడానికి ఉపయోగపడుతుంది.
గుడ్డులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో ఎంతో ఉపకరిస్తాయి. అంతేకాదు, గుడ్డులోని విటమిన్లు, ఖనిజాలు జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి.
కొలెస్ట్రాల్ విషయానికి వస్తే, అనేక పరిశోధనల ప్రకారం ఆహారం ద్వారా తీసుకునే కొలెస్ట్రాల్ మన రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలపై పెద్దగా ప్రభావం చూపదని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు పచ్చసొనతో సహా పూర్తి గుడ్డును తినడం వల్ల సాధారణంగా ఎలాంటి హానీ ఉండదు. రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లను పచ్చసొనతో కలిపి తీసుకోవడం ఆరోగ్యకరమైన ఆహారంలో భాగమేనని వైద్యులు సూచిస్తున్నారు.
అయితే పచ్చసొన అందరికీ ఒకేలా సరిపోతుందనుకోవడం సరైంది కాదు. ఇప్పటికే తీవ్రమైన గుండె జబ్బులు ఉన్నవారు, మధుమేహం, ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారు లేదా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా తీసుకుని గుడ్లు తీసుకోవడం మంచిది.
పచ్చసొనలో విటమిన్ B9 (ఫోలేట్) కూడా ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు, గర్భంలో ఉన్న శిశువు సరైన ఎదుగుదలకు చాలా అవసరం. అందుకే గుడ్డు పచ్చసొనను శత్రువులా చూడాల్సిన అవసరం లేదు. అది ప్రకృతి ఇచ్చిన ఒక మల్టీ విటమిన్ క్యాప్సూల్‌లాంటిది. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మితంగా తీసుకుంటే, గుడ్డు పచ్చసొన నుంచి పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
