Andhra: ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఓ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుంగనూరు పట్టణంలోని బీడీ కాలనీలో నివసిస్తున్న ఓ తల్లి, డబ్బు కోసం తన మైనర్ కూతురునే అమ్మిన ఘటన సంచలనం రేపుతోంది. బీడీ కాలనీకి చెందిన రామరాజు–శోభ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా, పెద్ద కూతురు (14)ను రూ.2 లక్షలకు అమ్మేసినట్లు బయటపడింది.
భర్త రామరాజుతో విభేదాల కారణంగా రెండు నెలల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చిన శోభ, పుంగనూరులోని టిడ్కో ఇళ్లలో నివసిస్తోంది. ఈ క్రమంలో రెడ్డెప్ప అనే మధ్యవర్తి సహాయంతో పక్కా ప్రణాళికతో పెద్ద కూతురిని అమ్మేందుకు ప్రయత్నించింది. కర్ణాటకలోని రాయల్పాడుకు చెందిన రెడ్డి రాజశేఖర్ (54) రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని తెలుసుకున్న మధ్యవర్తి, శోభతో చర్చలు జరిపి రూ.2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒప్పందం మేరకు రూ.50 వేల అడ్వాన్స్‌గా ఇచ్చి, దాదాపు 10 రోజుల క్రితం బెంగళూరులో మైనర్ బాలికకు పెళ్లి చేయించారు. ఈ పెళ్లికి తల్లి శోభే దగ్గరుండి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
పెళ్లి తర్వాత రాజశేఖర్ బాలికను చిత్రహింసలకు గురి చేయడంతో ఆమె తట్టుకోలేక చిన్నాన్నకు ఫోన్ చేసి విషయం తెలిపింది. చిన్నాన్న సహాయంతో పుంగనూరుకు చేరుకున్న బాలిక, కుటుంబ సభ్యుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన కర్ణాటకలో జరిగిందని భావించిన పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేయకపోయినా, బాలికను ఐసీడీఎస్ సిబ్బందికి అప్పగించి సంరక్షణ చర్యలు చేపట్టారు.
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో జిల్లా యంత్రాంగం సీరియస్‌గా స్పందించింది. ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. చదువుకోవాలనే బాలిక కోరిక మేరకు ఆమె విద్య కొనసాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు. విచారణలో తల్లి శోభ డబ్బులు తీసుకోలేదని చెబుతూ, మధ్యవర్తి రెడ్డెప్ప మాటలు నమ్మి తెలిసో తెలియకో తప్పు జరిగిందని అంగీకరించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోంది.
Andhra: 54 ఏళ్ల వ్యక్తితో 14 ఏళ్ల కూతురి పెళ్లి