Weather: తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం క్రమంగా తగ్గుతూ, ఎండ తీవ్రత స్పష్టంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఉదయం వేళల్లో మాత్రమే స్వల్పంగా చలి అనిపిస్తుండగా, పగటి సమయంలో ఎండ బాగా మండుతోంది. గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. మధ్యాహ్నం వేళల్లో పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ 35 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతున్నాయి. ఇంకా ఎండాకాలం పూర్తిగా ప్రారంభం కాకముందే ఇలా ఉష్ణోగ్రతలు పెరగడంతో, రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ను విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ వాతావరణ నివేదిక:
అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫియర్లో ఉత్తర, ఈశాన్య దిశల నుంచి గాలులు వీచుతున్నాయి. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో ప్రధానంగా పొడి వాతావరణమే కొనసాగనుంది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం:
మంగళవారం, బుధవారం రోజుల్లో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడవచ్చు. గురువారం కూడా పొడి వాతావరణమే ఉండే సూచనలు ఉన్నాయి.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:
మంగళవారం, బుధవారం పొడి వాతావరణం కొనసాగనుంది. కొన్ని చోట్ల ఉదయం వేళల్లో పొగమంచు కనిపించే అవకాశం ఉంది. గురువారం కూడా వాతావరణం పొడిగానే ఉండే అవకాశం ఉంది.
రాయలసీమ:
మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఉండే సూచనలు ఉన్నాయి. ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడవచ్చు. గురువారం కూడా పొడి వాతావరణమే కొనసాగనుంది.
గమనిక:
రాబోయే రెండు రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ వాతావరణ పరిస్థితి:
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, తెలంగాణలో దిగువ స్థాయి గాలులు ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీచుతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. అలాగే మంగళవారం నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణమే కొనసాగనుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Also Read: Viral: ప్రశాంతత కోసం ఆటో డ్రైవర్‌గా మారిన కార్పొరేట్ ఉద్యోగి
Weather: బాబోయ్.. ఈ సారి ఎండలంటే ఎండలు
