Medaram Jatara: మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు

Devotees Throng Medaram Ahead of Maha Jathara

Devotees Throng Medaram Ahead of Maha Jathara

Medaram Jatara: మేడారం మహా జాతరకు సమయం దగ్గరపడుతుండడంతో మేడారం పరిసరాలు భక్తుల సందడిగా మారాయి. ఈ రోజు మండమెలిగే పండుగ కావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. సమ్మక్క–సారలమ్మ గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ పండుగతోనే మహా జాతర ప్రధాన పూజల తంతు అధికారికంగా ప్రారంభం కానుంది.

సమ్మక్క దేవాలయం (మేడారం), సారలమ్మ గుడి (కన్నెపల్లి), అలాగే ఏటూరునాగారం మండలం కొండాయిలోని గోవిందరాజుల దేవాలయంలో ఇవాళ మండమెలిగె పూజలు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం నిర్వహించబడతాయి. డోలు వాయిద్యాల నడుమ పూజారులు, గ్రామస్తులు దిష్టితోరణాలు కట్టి గ్రామానికంతా అష్టదిగ్బంధనం చేపడతారు.

ఈ ప్రాంతంలో పూర్వం దేవాలయాల స్థానంలో గుడిసెలే ఉండేవి. జాతర సమయానికి అవి జీర్ణించిపోవడంతో పూజారులు అడవుల్లోని మండలు, గడ్డి, వాసాలు తెచ్చి కొత్తగా గుడులు నిర్మించేవారు. ఇదే ‘గుడిమెలిగే’గా పిలువబడేది. తరువాత ‘మండమెలిగే’ పండుగ జాతరకు వారం ముందే నిర్వహించే ఆచారంగా మారింది.

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క–సారలమ్మ మహా జాతర రెండేళ్లకొకసారి ములుగు జిల్లా మేడారంలో ఘనంగా జరుగుతుంది. మొదటి రోజు కన్నెపల్లినుంచి సారలమ్మ, పూనుగొండలనుంచి పగిడిద్దరాజు, కొండాయినుంచి గోవిందరాజుల ఆగమనం జరుగుతుంది. రెండో రోజు చిలుకలగుట్టనుంచి సమ్మక్క చేరుతుంది. మూడో రోజు గద్దెలపై వనదేవతల కొలువుతో భారీగా పూజలు నిర్వహిస్తారు. నాలుగో రోజు దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఈసారి జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది.

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు – 50% అదనపు ఛార్జీలు

జాతర నేపథ్యంలో ఈ నెల 25 నుంచి మేడారంకు తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడపనుంది. మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే స్పెషల్ సర్వీసులపై 50% అదనపు ఛార్జీ వసూలు చేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రాష్ట్రం నలుమూలల నుంచి మొత్తం 4,000 బస్సులు మేడారం వైపు పయనించనున్నాయి. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో 51 ప్రత్యేక బోర్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. మేడారం వద్ద బస్సుల కోసం 50 క్యూ లైన్లు, ఒకేసారి వెయ్యి బస్సులు పార్క్ చేసేలా ప్రత్యేక వసతులు కల్పించినట్లు తెలిపారు.

Also Read: Viral Flexi: పెళ్లి కూతురు ఉంటే చెప్పండి ప్లీజ్.. ఫ్లెక్సీ వైరల్

Medaram Jatara: మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు