Chollangi Amavasya: ఈ రోజు చొల్లంగి అమావాస్య. తూర్పు గోదావరి జిల్లా చొల్లంగి వద్ద ఉన్న గోదావరి నదీ–సాగర సంగమంలో ఈ రోజు పవిత్ర స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని విశ్వాసం ఉంది. నేడు స్నానం చేసి పితృ తర్పణాలు చేస్తే వంశాభివృద్ధి కలిగి, 21 తరాల పితృదేవతలకు నరక విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజే సప్తసాగర యాత్ర ప్రారంభమవుతుంది.
పితృదేవతలకు మోక్షం కలిగేలా అమావాస్య రోజున ధార్మిక కర్మలు చేయటం శ్రేయస్కరం. నదీ స్నానం చేసి పిండప్రదానం, పితృతర్పణాలు చేయాలి. నువ్వులు నింపిన రాగి పాత్ర, అన్నం, వస్త్రాల వంటి దానాలను పేదలకు లేదా బ్రాహ్మణులకు ఇస్తే శుభఫలితాలు ఉంటాయని అంటున్నారు.
ఈ రోజు మౌనవ్రతం పాటిస్తూ శివారాధన చేయటం మరింత మంచిదని పండితులు సూచిస్తున్నారు. రుద్రాభిషేకం, నవగ్రహాల ప్రదక్షిణం చేస్తే జాతక దోషాలు తొలగి పుణ్యఫలితాలు పొందుతారని చెబుతున్నారు.
చొల్లంగి అమావాస్య రోజున మనసును, శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కూడా సూచన ఉంది. అమావాస్య తిథి పూర్తయ్యే వరకు మాంసాహారాలు, మద్యం వంటి వాటిని దూరంగా పెట్టాలి. ఇంట్లో గొడవలు పెట్టకుండా, దూషణలు చేయకుండా, శాంతంగా దైవ చింతనలో గడపాలి. ఈ సమయంలో పితృదేవతలు ఇంటికి వస్తారని నమ్మకం ఉండటంతో గోర్లు, జుట్టు కత్తిరించడం, కొత్త వస్తువుల కొనుగోలు, శుభకార్యాల చర్చలు చేయకపోవడం శ్రేయస్కరమని చెబుతున్నారు.
