TG High Court: తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్టు సమాచారం బయటకు వచ్చింది. కోర్టు ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నించే సమయంలో, పీడీఎఫ్ ఫైల్‌కు బదులు ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ ‘BDG SLOT’ ఓపెన్ అవుతుండడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన నవంబర్ 11న జరిగినట్లు తెలుస్తోంది. అదే రోజున హైకోర్టు రిజిస్ట్రార్ ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెబ్‌సైట్‌లో అనుమానాస్పద మార్పులు గమనించిన ఐటీ విభాగం రిజిస్ట్రార్‌కి వివరాలు తెలియజేయగా, వెంటనే పోలీసులు సహాయం తీసుకున్నారు.
ఫిర్యాదు స్వీకరించిన అనంతరం పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెబ్‌సైట్‌ను ఎవరూ, ఎప్పుడు, ఎలా హ్యాక్ చేశారో గుర్తించడానికి ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే, సాంకేతిక బృందం వెబ్‌సైట్‌లో ఉన్న లోపాలను సరిచేసి సమస్యను తక్షణమే పరిష్కరించినట్టు తెలిసింది.
తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌లో పెండింగ్ కేసుల వివరాలు, రోజువారీ కోర్టు వ్యవహారాలు, జడ్జీల కోర్ట్ షెడ్యూల్ వంటి కీలక సమాచారం అందుబాటులో ఉండటంతో, ఈ ఘటన భద్రతా పరంగా ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం పోలీసులు హ్యాకింగ్‌కు కారణమైన వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
