No work-from-home: వారానికి ఐదు రోజులు ఆఫీసుకు రావాలన్న CEO ఆదేశంతో ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పారామౌంట్- స్కైడాన్స్ మీడియా విలీనం అనంతరం, కొత్త CEOగా బాధ్యతలు చేపట్టిన డేవిడ్ ఎల్లిసన్, కంపెనీ పాలసీల్లో పెద్ద మార్పు చేశారు. కరోనా తర్వాత నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH)లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇప్పుడు ఇకపై వారానికి ఐదు రోజులు ఆఫీసుకు రావాలని ఆయన ఆదేశించారు.
అయితే ఈ నిర్ణయం చాలామందికి నచ్చలేదు. ఉద్యోగులకు “ఆఫీసుకు వచ్చి పనిచేయడం సాధ్యంకాకపోతే బైఅవుట్ ఆఫర్ (స్వచ్ఛంద రాజీనామా)” తీసుకోవచ్చని ఎల్లిసన్ సూచించారు. ఈ ఆఫర్‌ను అంగీకరించినవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా వైస్ ప్రెసిడెంట్ స్థాయికి కంటే దిగువ హోదాలో పనిచేస్తున్న సుమారు 600 మంది ఉద్యోగులు ఈ ఆఫర్‌ను స్వీకరించి రాజీనామా చేశారు.
ఇక కంపెనీ లోపల ఈ పరిణామం పెద్ద చర్చకు దారితీసింది. చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారని, ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అసంతృప్తి పెరిగిందని సమాచారం. మరోవైపు, CEO ఎల్లిసన్ మాత్రం సంస్థ ఉత్పాదకత, టీమ్ వర్క్ మెరుగుపరచడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామంతో పారామౌంట్–స్కైడాన్స్ సంస్థలో పెద్ద ఎత్తున ఉద్యోగుల మార్పు చోటుచేసుకుంది. వర్క్ కల్చర్‌పై ఈ నిర్ణయం ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.
