Crime: కాపాడాల్సింది పోయి.. భార్యకు ఉరి ఎలా వేస్కోవాలో చూపించాడు

rajampet husband & Wife Incident, video-controversy

rajampet husband & Wife Incident, video-controversy

Crime: కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య జరిగే చిన్నచిన్న గొడవలు కొన్నిసార్లు విషాదకర ఘటనలకు దారితీస్తున్నాయి. కోపావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఇలాంటి దుర్ఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా రాజంపేట మండలంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తీవ్ర చర్చకు దారితీస్తోంది.

రాజంపేట మండలంలోని బోయినపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్ శ్రీనివాస్ రైల్వేలో లోకో పైలట్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య కృష్ణవేణితో గురువారం కుటుంబ కలహాల కారణంగా గొడవ జరిగినట్లు సమాచారం. స్థానికుల ప్రకారం ఈ దంపతుల మధ్య తరచూ వివాదాలు జరుగుతుండేవని తెలుస్తోంది. ప్రతిరోజూ గొడవపడినా కొద్దిసేపటి తర్వాత మళ్లీ సర్దుకుపోయేవారని గ్రామస్థులు చెబుతున్నారు. అందుకే ఈసారి కూడా సాధారణ గొడవగానే భావించారు.

అయితే ఈసారి పరిస్థితి విషాదకరంగా మారింది. గొడవ సమయంలో కోపంతో ఉరి వేసుకుంటానని కృష్ణవేణి భర్తతో చెప్పింది. మొదట అది కూడా సాధారణ బెదిరింపులాగే భావించినట్లు తెలుస్తోంది. కానీ కృష్ణవేణి నిజంగానే ఉరి వేసుకునే ప్రయత్నం చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ సమయంలో ఆమె భర్త శ్రీరామ్ శ్రీనివాస్ కూడా అక్కడే ఉన్నాడు.

భార్య ఉరి వేసుకుంటున్న సమయంలో ఆమెను అడ్డుకోవడం లేదా కాపాడే ప్రయత్నం చేయకుండా, ఉరి ఎలా వేసుకోవాలో సూచనలు చేస్తూ వీడియో రికార్డు చేసినట్లు సమాచారం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతను సరదాగా తీసుకున్నాడా లేక ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించాడా అన్న విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ ఘటనలో కృష్ణవేణి మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణవేణి మరణానికి ఆమె భర్తే కారణమని ఆరోపిస్తూ శ్రీరామ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆగ్రహంతో ఉన్న బంధువులు అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీరామ్ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. భార్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆమెను కాపాడకుండా వీడియో తీయడం తీవ్రంగా తప్పుబడుతూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Also Read: LPG Price: గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

Crime: కాపాడాల్సింది పోయి.. భార్యకు ఉరి ఎలా వేస్కోవాలో చూపించాడు