Srikakulam: శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు ప్రతిరోజూ వేలాది భక్తులు వెళుతుంటారు. అయితే ఎంత కష్టపడి వెళ్లినా అందరికీ తనివితీరా దర్శనం కలగడం సాధ్యం కాదు. సాధారణంగా అలాంటి సందర్భంలో మనం ఇంకోసారి వస్తామని భావించి తిరిగి వస్తాం. కానీ పలాసకు చెందిన హరిముకుంద పండా కుటుంబం మాత్రం భిన్నంగా ఆలోచించింది. పదేళ్ల క్రితం తిరుమలకు వెళ్లినప్పుడు సరిగ్గా దర్శనం కాకపోవడంతో, తమ ప్రాంతంలోనే తిరుమలలాంటి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు.
ఈ ఆలోచనకు ప్రేరణే హరిముకుంద పండా తల్లి హరివిష్ణుప్రియ. వందేళ్ల వయస్సు దాటినా ప్రతిరోజూ అమ్మవారికి సేవ చేస్తూ, దానాధర్మాల్లో ముందుండే ఆమె, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామిని దర్శించుకునే ఆలయం కట్టాలనే సంకల్పం చేసింది. పలాసలో తమకున్న 12 ఎకరాల కొబ్బరి తోటలోనే ఆలయానికి భూమిని కేటాయించి, ఐదేళ్ల క్రితం నిర్మాణాన్ని ప్రారంభించారు.
ఈ ఆలయాన్ని పూర్తిగా సొంత నిధులతోనే నిర్మిస్తున్నామని హరిముకుంద పండా చెప్పారు. అందుకోసం ఒక రూపాయి కూడా ఎవరి నుంచి తీసుకోలేదని స్పష్టం చేశారు. తల్లి హరివిష్ణుప్రియ వాస్తు శాస్త్రంలో నిపుణురాలు కావడంతో, ఏ విభాగం ఎక్కడ ఉండాలి, ఏ విగ్రహం ఎక్కడ ప్రతిష్టించాలి అన్నది ఆమె సూచించినట్టు తెలిపారు.
అయితే ఆలయ నిర్మాణంలో శిల్పకళకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు. జైపూర్‌తో పాటు తెలుగు రాష్ట్రాల నుండి ఏకశిలా విగ్రహాలను తెప్పించి ప్రతిష్టిస్తున్నారు. భక్తులకోసం స్నానాల కోసం ప్రత్యేకంగా కొలను, ఆర్చకుల నివాసాలు, వసతి గృహాలు, మరుగుదొడ్లు నిర్మించారు. ఉచిత వివాహాల కోసం కళ్యాణమండపం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ పరిసరాలను పచ్చగా తీర్చిదిద్దారు. 90 ఏళ్లు పైబడినా, హరిముకుంద పండా రోజూ తెల్లవారుజామునే లేచి హోమాలు, యోగ సాధన చేసి, ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయ పనుల్లోనే నిమగ్నమై ఉంటారు. భక్తుల కోసం, భక్తి కోసం ఆయన చేస్తున్న ఈ కృషి పలాసలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కొత్తగా మలుస్తోంది.
