Heavy Rains: దక్షిణ అండమాన్ సముద్రం మరియు దాని సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాత ప్రాంతంలో సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో నేడు ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఇది పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ బలపడి, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ రోజు, రేపు రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, ఉరుములు, మెరుపులు, అలాగే గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
గురువారం, శుక్రవారం రోజుల్లో హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.
ఏపీలోనూ భారీ వర్షాలు:
నైరుతి రుతుపవనాలు వెనక్కి తగ్గినప్పటికీ, ఈశాన్య రుతుపవనాల రాకతో దేశవ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి.
మంగళవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నేటి నుంచి వరుసగా మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి వర్షాలు పడవచ్చని తెలిపింది.
వర్షాల కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లరాదని వాతావరణ అధికారులు సూచించారు.
